ఆటో డ్రైవర్ బ్యాంకు అకౌంట్లో.. రూ.300 కోట్ల రూపాయలు..!

పాకిస్తాన్‌కి చెందిన ఓ సగటు ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయనను పిలిపించి విచారించారు.

Last Updated : Oct 14, 2018, 09:27 PM IST
ఆటో డ్రైవర్ బ్యాంకు అకౌంట్లో.. రూ.300 కోట్ల రూపాయలు..!

పాకిస్తాన్‌కి చెందిన ఓ సగటు ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయనను పిలిపించి విచారించారు. అప్పుడు వారికి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తన బ్యాంకు ఖాతాలోకి అంత సొమ్ము ఎలా వచ్చి చేరిందో తనకు తెలియదని ఆ ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోతూనే.. మరోవైపు తనకూ ఏ పాపమూ తెలియదని వాపోయాడు. 2005లో ఓ సంస్థలో ఉద్యోగానికి చేరినప్పుడు.. వారు తనతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించారని.. ఆ ఉద్యోగం మానేశాక తాను ఆ బ్యాంకు ఖాతాను వాడడం మానేశానని సదరు ఆటో డ్రైవర్ తెలిపాడు.

తను జీవితంలో కనీసం రూ.లక్ష రూపాయలు కూడా కళ్లారా చూడలేదని.. అలాంటిది తన ఖాతాలో రూ.300 కోట్లు వచ్చి పడడం ఆనందంగా ఉన్నా.. అది తనది కానీ డబ్బు కాబట్టి.. తనకు ఆ డబ్బుకి సంబంధం లేదని.. ఆయన పోలీసులకు చెప్పాడు. తన ఖాతాను ఉపయోగించుకొని.. ఎవరో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ కేసును ఛేదించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు సకల యత్నాలూ చేస్తున్నారు.

ఒక సామాన్య వ్యక్తి ఖాతాలోకి కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చి పడుతుండడంతో బ్యాంకు అధికారులు.. ఇంటెలిజెన్స్ వారికి సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగారు. ఆ ఖాతా ఓ ఆటో తోలుకొనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు తెలుసుకొన్నారు. ఈ మధ్యకాలంలో ఆసియా దేశాల్లో మనీ ల్యాండరింగ్ కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆగంతక ఖాతాల నుండి కోట్లాది డబ్బు ట్రాన్స్ ఫర్ కావడంతో.. బ్యాంకు అధికారులే ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. 

Trending News