అక్టోబర్‌లో ప్రియాంక, నిక్‌ల వివాహం..!

ప్రియాంక చోప్రా నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జాతీయ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Last Updated : Jul 28, 2018, 05:38 PM IST
అక్టోబర్‌లో ప్రియాంక, నిక్‌ల వివాహం..!

ప్రియాంక చోప్రా నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జాతీయ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి కోసం ఆమె రెండేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌లో చేస్తున్న 'భారత్' సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ సినిమా  దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.  'ప్రియాంక చోప్రా 'భారత్'  చిత్రం నుంచి తప్పుకున్నారు. దానికి చాలా ప్రత్యేకమైన కారణమే ఉంది. అది నిక్‌తో తన పెళ్లి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఆమె చివరి నిమిషంలో వెల్లడించారు. ప్రియాంక హ్యాపీ లైఫ్ గడపాలని 'భారత్‌' మూవీ యూనిట్‌ కోరుకుంటోంది' అని పేర్కొన్నారు అబ్బాస్‌.

అమెరికా పౌరుడైన నిక్‌ జొనాస్‌ గాయకుడు, పాటల రచయిత. అమెరికా మీడియాలో రిపోర్టుల కథనం మేరకు, నిక్, ప్రియాంక ఇద్దరూ ప్రియాంక 36వ పుట్టిన రోజును పురస్కరించుకొని లండన్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. నిక్(25) తన ప్రేయసికి ఉంగరం ఇవ్వడం కోసం న్యూయార్క్ అంతా తిరిగాడని పీపుల్స్ మ్యాగజైన్ పేర్కొంది.

ఈ ఏడాది మేలో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ.. రెండు నెలల తర్వాత ఒక అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అక్టోబర్‌లో వివాహం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తాజా నివేదికల సారాంశం. ప్రియాంక కూడా పెళ్లి గౌనును సెలెక్ట్ చేసుకుందని, వివాహానికి సంబంధించిన షాపింగ్ చేసుకుంటోందని నివేదికలు వెల్లడించాయి. ఇరుకుటుంబాలు కూడా గోవాకు విహార యాత్రకు వెళ్లొచ్చారని తెలిసింది.

పెళ్లి కోసమే సల్మాన్‌ హీరోగా చేస్తున్న 'భారత్‌' చిత్రం నుంచి తప్పుకోవడం.. ఆ విషయాన్ని దర్శకుడు అబ్బాస్‌ చెప్పడంతో ప్రియాంక, నిక్‌లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని స్పష్టమైంది. అయితే ఈ విషయాన్ని ప్రియాంక అధికారికంగా చెప్పడమే తరువాయి.

Trending News