నాగబాబు ట్విటర్ ( Nagababu twitter ) ద్వారా నాథూరాం గాడ్సే జయంతి నాడు గాడ్సేను ఓ దేశభక్తుడిగా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే ( Nathuram Godse ) దేశభక్తుడు ఎలా అవుతాడంటూ నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఉద్దేశం అది కాదని వివరణ ఇస్తూ మరునాడు మరో ట్వీట్ చేయకతప్పలేదు. అయినప్పటికీ ఈ విషయంలో నాగబాబుని విమర్శించిన వాళ్లకు ఆయన ఇచ్చిన వివరణ కూడా సంతృప్తినివ్వలేదు. నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీనటుడు, జనసేన పార్టీ నేత అయిన నాగబాబు.. మహాత్మా గాంధీని కించపరిచేలా ట్వీట్ చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోటూరి మానవతా రాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ( నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు )
ఇదిలావుండగానే, తాజాగా నాగబాబు మరోసారి గాంధీ పేరు ప్రస్తావిస్తూ.. దేశభక్తులపై మరో ట్వీట్ చేశారు. '' గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
అంతేకాకుండా స్వతంత్ర భారతావనికి సేవలు అందించిన దేశభక్తుల ఫోటోలను సైతం భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందంటూ నాగబాబు పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. '' Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ'' అని చేసిన ట్వీట్‌తో నాగబాబు మరోసారి వార్తల్లోకెక్కారు.
Nagababu`s tweet : మహాత్మా గాంధీపై మరో ట్వీట్ చేసిన నాగబాబు