అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నాలపై ఎఫ్ఐఆర్ నమోదు!

అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నాలపై ఎఫ్ఐఆర్ నమోదు!

Last Updated : Feb 14, 2019, 09:54 PM IST
అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నాలపై ఎఫ్ఐఆర్ నమోదు!

ముజఫర్‌పూర్: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' మూవీలో నటించిన బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా సహా మరో 12 మందిపై ముజఫర్‌పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్  నమోదైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా అప్పట్లో ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన ప్రముఖ రచయిత సంజయ్ బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది సబ అలం సబ్-డివిజినల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలు కీలక నేతలను కించపరిచేలా చిత్రీకరించినందును అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుధీర్ కుమార్ ఓజా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. 

సుధీర్ కుమార్ ఓజా పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ మూవీ యూనిట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాల్సిందిగా కంటి పోలీసులను ఆదేశిస్తూ జనవరి 8వ తేదీన ఆదేశాలు జారిచేసింది. అయితే, కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టిన కంటి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మరోసారి ఓజా కోర్టును ఆశ్రయించారు. దీంతో తమ ఆదేశాలను అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి ముజఫర్‌పూర్ జిల్లా సీనియర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. 

కోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా ఎస్ఎస్పీ.. అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా సహా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కంటి పోలీసులను ఆదేశించింది.

Trending News