మన్నత్ .. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ సొంత ఇల్లు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అతనికి ఆ ఇల్లే ఒక భూతల స్వర్గం. అదే తన ప్రాణం.. అదే తన ఊపిరి అని షారుఖ్ సైతం అనేకసార్లు చెప్పారు . ఈ రోజు "మన్నత్" గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం అనేకమంది అభిమానులు అతన్ని చూడడం కోసం "మన్నత్" ముందు క్యూ కడుతుంటారు. బాలీవుడ్‌లో సెలబ్రిటీలకు ఉన్న ఇళ్ళు అన్నింటిలో తనకంటూ ఒక ప్రాధాన్యాన్ని సంపాదించుకున్న ఇల్లు ఇది. అయితే దానిని షారుఖ్ సొంతం చేసుకోకముందు.. ఒక గుజరాతీ వ్యాపారి ముచ్చటపడి కట్టుకున్నారు. అప్పటిలో దానిని "విల్లా వియన్నా" అని చాలామంది పిలుచుకొనేవారట.
దాదాపు 20 సంవత్సరాల క్రితం 13 కోట్ల రూపాయలకు షారుఖ్ ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఖరీదు దాదాపు 200 కోట్లు ఉంటుంది
షారుఖ్ ఖాన్ ఆ ఇంటిని కొనడానికి ఒక ప్రధాన కారణముందని చాలామంది చెబుతుంటారు. తనకంటూ ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి తన ఇంటిలోనే చాలా విశాలమైన మందిరం కట్టాలన్నది ఎప్పటినుండో షారుఖ్‌కి ఉన్న కోరికట. ఆ సౌలభ్యం మన్నత్‌కు ఉన్నట్లు ఆయన ఆ ఇంటిని చూడగానే గుర్తించారు.
మన్నత్‌లో ఆర్కిటెక్చర్ డిజైన్లు అన్నీ కూడా దాదాపు ఇటాలియన్ నిపుణులు చేసినవే. ఇంటీరియర్స్ అన్నీ కూడా చాలా ఖరీదైనవి. ఎం.ఎఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ కూడా ఆ ఇంటిలో ఉన్నాయి. ఆ ఇంటిలో షారుఖ్ కోసం ఒక ప్రైవేటు బార్‌తో పాటు పిల్లల కోసం ఒక పెద్ద గ్రంథాలయం, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ కూడా కట్టించారు.
ఆ బిల్డింగ్‌కు అనుబంధంగా ఉన్న మరో చిన్న భవనంలో చాలా పెద్ద లాంజ్ ఉంటుంది. అక్కడే షారుఖ్ స్టోరీ సిట్టింగులకు హాజరవుతారని వినికిడి. ఆ లాంజ్ పక్కనే ఉండే కిచెన్‌లో ఇద్దరు ప్రముఖ చెఫ్‌లు షారుఖ్‌కు తమకు వచ్చే డైలీ మెనూ ప్రకారం తనకు ఇష్టమైన వంటలు చేసిపెడతారట.
ప్రపంచంలోనే ఖరీదైన ఇళ్లకు సంబంధించి ఓ పత్రిక చేసిన సర్వే ప్రకారం టాప్ టెన్ ఖరీదైన మాన్షన్స్‌లో మన్నత్ కూడా ఉందట.
తొలుత తన ఇంటికి "జన్నత్" అని పేరు పెట్టుకున్నారు షారుఖ్. అయితే ఇంటిలోకి షిఫ్ట్ అయ్యాక కెరీర్ బాగా కలిసి రావడంతో "మన్నత్" అని పేరు మార్చారు.
మన్నత్ భవనం ఎంత పెద్దదంటే, అందులోని గదుల్లో దాదాపు 225 మంది నివసించవచ్చట.
ఏదేమైనా.. షారుఖ్ కలల నిలయం మన్నత్ ఒక మంచి ప్రాధాన్యమున్న కట్టడం అనడంలో అతిశయోక్తి లేదు.