సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఇటీవలే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదే పదే ఫోటోలు దిగడానికి తన అభిమానులు తన ఇంటికి రానవసరం లేదని.. ప్రతీ నెల ఏదో ఒక ప్రాంతంలో తాను అభిమానులను కలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ మధ్యకాలంలో లారెన్స్‌తో కలిసి ఫోటో దిగడానికి ఓ అభిమాని ఇంటి నుండి బయలుదేరుతూ, యాక్సిడెంట్‌లో మరణించారు.
ఈ వార్త విన్న లారెన్స్ తాను ఈ ఘటనతో చాలా బాధపడ్డానని.. కొన్ని రోజులు మనసు ఏదోలా అయిపోయిందని.. అందుకోసం అభిమానుల వద్దకు తన వీలును బట్టి, సమయాన్ని బట్టి తానే వెళ్లాలని భావిస్తున్నానని తెలిపారు. లారెన్స్ తన అభిమాని శేఖర్ యాక్సిడెంట్‌లో మరణించాక.. ఆయనే స్వయంగా అంత్యక్రియలకు వెళ్లి తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. 7వ తేదిన తొలిసారిగా సేలంలో తన అభిమానులను కలుస్తానని కూడా ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. రాఘవ లారెన్స్ ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. చెన్నై వరదల సమయంలో కూడా రూ.కోటి రూపాయలను నిర్వాసితులకు విరాళంగా ప్రకటించారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్న పిల్లలకు కూడా ఆయన చేయూతనిస్తున్నారు.
నేనే అభిమానుల వద్దకు వెళ్తా: లారెన్స్