అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరితో సినిమా.. షూటింగ్ దాదాపు పూర్తి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్యకు సంబంధించి ఓ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిని సినిమాగా చూడనున్నాం.

Last Updated : Mar 10, 2020, 09:12 AM IST
అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరితో సినిమా.. షూటింగ్ దాదాపు పూర్తి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర కిందట ప్రణయ్‌ హత్యకేసు కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు,  అమృత ప్రణయ్ తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 9న మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో, అనంతరం సైతం అమృత వర్సెస్ ఆమె తల్లి, బాబాయ్ శ్రవణ్ అనేలా పరిస్థితి మారిపోయింది. అమృత, ప్రణయ్ ప్రేమ కథ, ఆపై విషాదాన్ని తెరపై చూసే అవకాశం రానుంది.

Also Read: తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన అమృత

అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ, ఆపై జరిగిన పరిణామాలతో ఓ సినిమా తెరకెక్కనుంది. శివ నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడు సినిమా తీయనున్నాడు. సినిమాకు ఎంఎన్ఆర్ చౌదరి నిర్మాతగా వ్యవహరించనుండగా.. ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్‌ పోషించనుండగా.. సీనియర్ నటీమణులు జమున, అన్నపూర్ణమ్మ, నటుడు బాలాదిత్య, అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని, త్వరలో తమ సినిమా థియేటర్లకు రానుందని నటుడు బాలాదిత్య చెప్పారు. వాస్తవ ఘటనలు చూపిస్తూనే, కాస్త కమర్షియల్ హంగులు జోడించనున్నారు.

Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్

ఏడాదిన్నర కిందట ప్రణయ్‌ పరువుహత్యకు గురయ్యాడు. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడ్ని పెళ్లిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మారుతీరావు కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చిమరీ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతో పాటు అతడి సోదరుడు శ్రవణ్ నిందితులుగా ఉన్నారు. జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై మారుతీరావు బయటకు వచ్చారు. కూతురు ఇప్పటికీ ఇంటికి రాకపోవడం, కేసుల్లో ఇరుక్కోవడంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News