సుప్రీం కోర్టు మెట్లెక్కిన 'పద్మావత్' నిర్మాతలు

దీపికా పదుకునె టైటిల్ రోల్ పోషించిన పద్మావత్ సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టు మెట్లెక్కారు.

Last Updated : Jan 17, 2018, 12:45 PM IST
సుప్రీం కోర్టు మెట్లెక్కిన 'పద్మావత్' నిర్మాతలు

దీపికా పదుకునె టైటిల్ రోల్ పోషించిన పద్మావత్ సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో నిషేధం విధించడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన వయాకామ్18 మోషన్ పిక్చర్స్, భన్సాలి ప్రొడక్షన్స్ సంస్థలు కోర్టుని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ని స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఏర్పాటు చేసిన కమిటీ ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డ్ సైతం అనుమతి ఇచ్చిన సినిమాను అడ్డుకునే హక్కు రాష్ట్రాలకు, ఇతర సంస్థలకు ఎక్కడుంది అని ప్రశ్నిస్తూ పద్మావత్ చిత్ర నిర్మాతలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇదిలావుంటే, ఈ సినిమాను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోన్న కర్ణిసేన ఇప్పటికీ అదే వైఖరిని అవలంభిస్తోంది. ఏదేమైనా పద్మావత్ సినిమాను దేశవ్యాప్తంగా ఆడనివ్వం అని ఆ సంస్థ అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి స్పష్టంచేశారు. అంతేకాకుండా రాజ్‌పుత్ సామాజిక వర్గం మనోభావాలని అర్థం చేసుకుని, ఆ సామాజికవర్గాన్ని కించపర్చేలా తెరకెక్కించిన పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందిగా తాను ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు కల్వి. 

Trending News