'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ

'Oke Oka Jeevitham' Movie Review in telugu: శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో అనేది రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 9, 2022, 08:24 AM IST
'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ

'Oke Oka Jeevitham' Movie Review in telugu: చాలా కాలం నుండి సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. కాని విడుదలకు కొద్ది రోజుల ముందు సెలబ్రిటీలకు షో వేయడంతో సినిమా చూసిన సెలబ్రిటీలందరూ ఎమోషనల్ అవ్వడం సినిమా అద్భుతం అని కొనియాడడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఎస్సార్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ రాజ్ అనే తమిళ నిర్మాతలు నిర్మించిన ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. రీతు వర్మ శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. నాజర్, అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో అనేది రివ్యూలో చూద్దాం. 

కథ: 
ఆది(శర్వానంద్) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. అతనికి తల్లి అన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం. సంగీతం అంటే ఇష్టమే కానీ అందరిలో పాడాలంటే మాత్రం చాలా బెరుకు మరోపక్క చైతన్య(ప్రియదర్శి) ఎలా అయినా తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటాడు. అయితే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అనేక సంబంధాలను తానే రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి నచ్చుతుంది కానీ సరిగ్గా ఆ సమయంలోనే చిన్నప్పుడు తాను వద్దనుకున్న తన స్కూల్ ఫ్రెండ్ ఫోటో చూసి ఆమెను ఎలా మిస్ చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క శ్రీనివాస్(వెన్నెల కిషోర్) చదువు సరిగ్గా చదువుకోకపోవడంతో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా స్థిరపడతాడు. అద్దె ఇళ్లు చూసి పెడుతూ ఉంటాడు. శ్రీనివాస్ అనుకోకుండా పాల్(నాజర్) అనే ఒక సైంటిస్ట్ కి ఒక ఇల్లు అద్దెకి ఇప్పిస్తాడు. అలా ఇప్పించిన సమయంలోనే పాల్ ఇచ్చిన ఒక ఆఫర్ తో ఈ ముగ్గురూ టైం డ్రైవల్ చేసేందుకు సిద్ధమవుతారు. పాల్ పుణ్యమా అని సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్తారు, వెనక్కి వెళ్లిన తర్వాత విధిని మార్చడానికి ప్రయత్నిస్తారు ఈ ముగ్గురు కలిసి విధిని మార్చారా? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే 

విశ్లేషణ:
గతంలో అనేక టైం ట్రావెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా కూడా టైం ట్రావెల్ సినిమానే అనే విషయాన్ని విడుదలకు ముందే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. జీవితంలో ఎలాంటి గమ్యం లేకుండా సాగిపోతున్న ముగ్గురు చిన్ననాటి స్నేహితులు తమ జీవితాలను మళ్లీ వెనక్కు వెళ్లి మార్చుకునే అవకాశం వస్తే ఏం చేశారు? అది ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనే ఆసక్తికరమైన లైన్ తో సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్. సాధారణంగా అమ్మ అంటేనే ఒక ఎమోషన్ అందుకే అమ్మ నేపథ్యంలోనే ఈ టైం ట్రావెల్ కథ అల్లుకున్నాడు. దానికి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ ఇచ్చి ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు. పట్టి పట్టి చూస్తే సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి ఒక రకంగా ఇదంతా ఏదో చిన్న పిల్లల ఆటలాగా చందమామ కథ లాగా అనిపిస్తుంది. అది కాస్త సిల్లీగా అనిపించినా కథనం మాత్రం బలంగా ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు. ఆది, చైతన్య, శ్రీనివాస్ ముగ్గురూ కూడా టైమ్ మిషన్ లోకి వెళ్లేంత వరకు.. స్టోరీ నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాక వచ్చే సీన్స్ దాదాపు ఆకట్టుకుంటాయి..భవిష్యత్ నుంచి వచ్చి తమ చిన్నతనాన్ని తామే చూసుకుని, తమతో తామే ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం అనే ఆలోచన చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా శర్వానంద్, అమల అక్కినేని మధ్య దర్శకుడు రాసుకున్న ప్రతి సీన్ ఎమోషనల్ గా ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా ఉంది..ఇక తల్లీ కొడుకులుగా ఈ ఇద్దరూ బాగా సెట్టయ్యారని చెప్పక తప్పదు. అయితే ఇంతటి ఎమోషనల్ ట్రాక్ లోనూ..వెన్నెల కిషోర్, ఆయన చిన్ననాటి పాత్ర మధ్య వచ్చే సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాల్లో చూశాం కాబట్టి ఈ సినిమాలో అనుకున్న సీన్స్ మరింత బలంగా ఉండేలా లాజికల్ గా ఉండేలాగా రాసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. సైన్స్ తో ఏదైనా సాధ్యమే అని చెబుతూనే.. విధిని ఎవరూ మార్చలేరని చూపించాడు దర్శకుడు.

నటీ నటులు విషయానికి వస్తే
శర్వానంద్ కు చాలాకాలం తర్వాత నటనలో ఛాలెంజింగ్ రోల్ దొరికింది అని చెప్పచ్చు. అక్కినేని అమలతో కలిసి ఆయన నటించిన అన్ని ఎమోషనల్ సీన్స్ దాదాపు కన్నీళ్లు పెట్టిస్తాయి. అయితే అక్కినేని అమల చాలా సహజంగా నటించారు కానీ ఎందుకో ఆమె నటన కాస్త అసహజంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిస్థాయి ఎమోషనల్ డ్రామాలో కూడా తనదైన శైలిలో నవ్వులు పండించాడు వెన్నెల కిషోర్. ప్రియదర్శి కూడా తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు.  రీతు వర్మ, నాజర్ పాత్రలు తమ పరిధి మేర నటించే ప్రయత్నం చేశారు.. తమిళ తెలుగు ద్విభాషా చిత్రం అయినా ఎక్కువగా తెలుగు నటులనే తీసుకున్నారు దర్శకుడు. 
 
సాంకేతిక వర్గం పని తీరు విషయానికి వస్తే: 
తల్లి ప్రేమపై స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను సిద్ శ్రీరామ్ పాడిన పాట.  కృష్ణకాంత్ రాసిన 'ఒకటే కదా' పాటలు ఆకట్టుకున్నాయి. కార్తీ పాడిన 'మారిపోయే' పెద్ద స్క్రీన్ లో చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ సాలిడ్ అవుట్‌పుట్ అందించాడనే చెప్పాలి.  తరుణ్ భాస్కర్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను బాగా ఎలివేట్ చేసింది. ఆర్ట్ డైరెక్టర్ ఎన్ సతీష్ కుమార్ పని తీరు కూడా బాగుంది. అయితే కాస్ట్యూమ్ డిజైనర్లు పాత రోజుల్లోకి వెళ్లాక కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. 
 
ఫైనల్ గా:
లాజిక్ ల కోసం వెతుక్కోకుండా  చూస్తే ఓవరాల్ గా ఒకే ఒక జీవితం.. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కామెడీ లవర్స్ కు కూడా బాగా నచ్చే మూవీ ఇది. కొత్త తరహా కధలు రావడం లేదని బాధ పడేవారికి పర్ఫెక్ట్ సమాధానం ఈ సినిమా. 

Rating: 3/5

బ్యానర్: డ్రీమ్ వారియర్స్ చిత్రాలు
తారాగణం: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, నాజర్, రవి రాఘవేంద్ర, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, జై ఆదిత్య, మధునందన్, అలీ, హితేష్, నిత్యరాజ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
నిర్మాత: SR ప్రకాష్ బాబు & SR ప్రభు
దర్శకుడు: శ్రీ కార్తీక్

Trending News