మెగాస్టార్ సినీ ప్రస్థానం...

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ప్రపంచంలో మకుంటం లేని మారాజు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. 

Last Updated : Sep 26, 2017, 07:03 PM IST
మెగాస్టార్ సినీ ప్రస్థానం...

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ప్రపంచంలో మకుంటం లేని మారాజు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగిన మెగాస్టార్...నాట్యానికి పెట్టింది పేరు. నాట్యంలోనే కాదు నటనలో కూడా ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతాడాయన. తన మల్టీ టాలెంట్ తో కోట్ల మంది హృదయాల్లో శాస్వత స్థానం సంపాదించుకున్న చిరు జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం గురించి ఒక్కసారి తెలుసుకుందాం.. 

జీవిత విశేషాలు..

చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించిన పవన్ కల్యాణ్ కు సొంత అన్నయ్య.

చలనచిత్ర ప్రస్థానం...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గనటుడు మోగాస్టార్ చిరంజీవి. చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. మన ఊరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. 

ఒడిదుడుకులు...

ప్రతి మనిషికి గడ్డుకాలం ఉంటుంది..ఈ విషయంలో చిరంజీవి మినహాయింపు ఏమీ కాదు. 1995 తర్వాత కొంతకాలం పాటు చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు. మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, 2000 శతాబ్దంలో హిట్లర్, చూడాలని వుంది, ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా.. ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు. ఇటు తెలుగులోనే కాకుండా , తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు. 

చిరు ప్రత్యేకతలు..

* నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు. నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలన చిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెర తీశాడనటంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

* ప్రారంభ దశలో సహ నటుడు గా, నెగటివ్ పాత్ర లతో, విలన్ గా నటించిన చిరు.., కొంత నిలదొక్కుకున్న తర్వాత  హాస్య భరిత చిత్రాలతో పాటు సాంఘిక,  పౌరాణిక పాత్రలతో నటించారు. ఈ విధంగా చిరంజీవి నటుడిగా పరిపూర్ణతని సంతరించుకొన్నారు.

సత్కారాలు:
*  2006 జనవరిలో చిరంజీవి పద్మభూషన్ అవార్డు అందుకున్నారు.
* 2006లో  ఆంధ్ర యూనివర్శిటీ చిరంజీవికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.

Trending News