పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'అజ్ఞాతవాసి' రిలీజ్‌కి ఒక్క రోజు ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొడకా కోటేశ్వ ర రావు పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా వుందని, వెంటనే సినిమాలోంచి ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నామాల కోటేశ్వర రావు అనే న్యాయవాది మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేరున్న సినీ నటుడు మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో కొనసాగుతున్న పవన్ కల్యాణ్.. కోటేశ్వర రావు అనే పేరున్న వాళ్ల మనోభావాలు దెబ్బతీసేలా పాట పాడటం తీవ్ర అభ్యంతరకరంగా వుందని నామాల కోటేశ్వర రావు ఆవేదన వ్యక్తంచేశారు.
మాచవరం పోలీసులకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నామాల కోటేశ్వర రావు.. సినిమాను ఆపాలి అనే స్టంటుతో తాను ఈ ఫిర్యాదు చేయలేదని, ఆ మాటకు వస్తే, అసలు తనకు పెద్దగా సినిమా పరిజ్ఞానమే లేదని అన్నారు. ''కోటేశ్వర రావు పాట విడుదల తర్వాత తనని తన ఇంట్లోనే పిల్లలు, కోర్టు ఆవరణలో స్నేహితులు కొడకా కోటేశ్వర రావు అని హేళన చేయడం తనకి అవమానంగా అనిపించింది. అందుకే తాను ఆ పాటపై అభ్యంతరం చేయడం జరిగింది తప్పితే ఇందులో తనకు ఎటువంటి ఉద్దేశం లేదు'' అని అభిప్రాయపడ్డారు.
సమాజంలో గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న తానే దీనిపై పోరాటం చేయకపోతే ఇదే పేరు కలిగిన సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి ? వారి పరిస్థితి ఇంకెలా వుంటుంది ? అందుకే మేధావులు మౌనం వహించకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదు చేశాను. ఒకవేళ పోలీసులు కానీ సినీ ప్రముఖుల ఒత్తిళ్లకు తలొగ్గి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే, తాను రేపు కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసి పోలీసులపై ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడబోను అని నామాల కోటేశ్వర రావు స్పష్టంచేశారు.
ఇంకొద్ది గంటల్లో సినిమా విడుదల అవుతుంది అనగా నామాల కోటేశ్వర రావు ఇచ్చిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు ? అతడి ఫిర్యాదుపై అజ్ఞాతవాసి సినిమా యూనిట్ సభ్యులు ఎలా స్పందించనున్నారనేది వేచిచూడాల్సిందే.