రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందించిన కమల్ హాసన్

గత ఏడాది కాలంగా తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయ నాయకులని ఎండగడుతూ వస్తున్నారు.

Last Updated : Dec 31, 2017, 06:56 PM IST
రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందించిన కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్పందించిన మరో స్టార్ హీరో కమల్ హాసన్.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీని తాను స్వాగతిస్తున్నాను అని స్పష్టంచేశారు. తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ ఇద్దరు హీరోలు గత కొంత కాలంగా అక్కడి రాజకీయాలపై దృష్టిసారిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఇవాళ కొత్తది కాదు. ఇటీవలే తన బర్త్ డే జరుపుకున్న కమల్ హాసన్ సైతం తన రాజకీయ ప్రవేశం ఖాయం అంటూ ప్రకటించారు. అంతేకాకుండా గత ఏడాది కాలంగా తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయ నాయకులని ఎండగడుతూ వస్తున్నారు. ఇటీవలే తమిళనాడు సీఎం పళనిస్వామిపై సైతం కమల్ హాసన్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేసిన తీరు పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. 

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఊపందుకున్న తొలినాళ్లలో రజినీకాంత్ వైఖరిని సైతం విమర్శించిన కమల్ హాసన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా రజినీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్ తీరు చూస్తోంటే అవసరమైతే, ఆ ఇద్దరూ కలిసి పనిచేస్తారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటికీ ఆ ఇద్దరి నుంచి ఎటువంటి సమాధానం రానుందో వేచిచూడాల్సిందే.

 

Trending News