ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, వీరుల పాత్రల్లో సినీ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. ఆ పాత్రల్లో నటులు ఒదిగిపోయిన తీరును బట్టి జనాలు కూడా ఆ నటులకు నీరాజనాలు పడుతుంటారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ నటనకూ... మేజర్ చంద్రకాంత్ చిత్రంలో శివాజీ పాత్ర పోషించిన ఎన్టీఆర్ నటనకూ జనాలు అలాగే బ్రహ్మరథం పట్టారు. వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో శివాజీ గణేషన్ కనిపించినా, గౌతమ పుత్ర శాతకర్ణిగా బాలయ్య కదం తొక్కినా అది అభిమానులకు వీనుల విందుగానే మారింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి అంటూ తన అభిమానులను అలరించడానికి వస్తున్నారు.
ఇదంతా సినిమాల వరకు అయితే ఫరవాలేదు. కానీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే సినీ ప్రముఖులు ఇటీవలి కాలంలో.. ప్రముఖ విప్లవకారులు లేదా సాహితీ దురంధరుల ఫోటోలు పెట్టుకొని కూడా జనాలను ఆకర్షించడం పరిపాటి అయిపోయింది. ఇటీవలే ప్రముఖ తమిళ సాహితీవేత్త సుబ్రహ్మణ్య భారతి ఫోటోని తన ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు నటుడు కమల్ హసన్. భారతీయార్ గెటప్‌లో ఉన్న కమల్ ఫోటోని చూసి ఆయన అభిమానులు విపరీతంగా ఆ పోస్టును షేర్ చేశారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో టాలీవుడ్ అభిమానులు కూడా తక్కువ కాదండోయ్.
గతంలో క్యూబా విప్లవకారుడు చేగువేరా ఫోటోని పవన్ కళ్యాణ్ ఫోటోతో మార్ఫ్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే నిజంగా గొప్ప గొప్ప లెజెండ్స్‌తో సినీ నటులను పోల్చడం ఎంత వరకు సబబు అనేది విమర్శకుల వాదన. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే చందంగా ఈ సంప్రదాయం పెరిగిపోయే అవకాశం కూడా ఉందని కొందరి భావన. అయితే అభిమానం ముందు ఇవన్నీ బలాదూర్.. చాలామంది అభిమానులు తమ హీరోలను కూడా లెజెండ్స్‌గానే చూస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను మోసం చేయకుండా.. ప్రజారంజక పాలన చేయాలనే కోరుకుంటున్నారు.
లెజెండ్స్ వర్సెస్ సినీ సెలబ్రిటీస్..!