టాలీవుడ్లోనే కాకుండా దక్షిణాది హీరోల్లోనే స్టైలిష్ స్టార్‌గా పేరున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా కోసం ఇంతకు ముందెప్పుడూ ఎంచుకోని పాత్రను ఎంచుకుంటున్నాడట. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాలో ఓ రాజకీయ నాయకుడి పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. నా పేరు సూర్య సినిమా ఫలితం అభిమానులను కొంత డిజప్పాయింట్ చేయడంతో ఆ తర్వాత మరో మంచి సినిమాతోనే అభిమానుల ముందుకొస్తానని అల్లు అర్జున్ ఇటీవలే మాటిచ్చాడు. ఈమధ్యే విక్రమ్ కుమార్ వినిపించిన ఓ స్టోరీ లైన్‌కి అల్లు అర్జున్ ఓకే చెప్పినప్పటికీ.. విక్రమ్ కుమార్ ఇంకా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు.
ఇదిలావుంటే, ఈలోగా ఏదైనా మంచి సినిమా ఆఫర్ చేయొచ్చు కదా అని అల్లు అర్జున్ చేసిన విజ్ఞప్తి మేరకు ఇటీవలే దిల్ రాజు ఓ కొత్త రచయితను అల్లు అర్జున్ వద్దకు పంపించాడట. దిల్ రాజు పంపించిన ఆ కొత్త రచయిత చెప్పిన కథ అల్లు అర్జున్‌కి బాగా నచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో హీరో ఓ రాజకీయ నాయకుడిగా నటించాల్సి ఉందని, ఆ సినిమా కోసం సభకు నమస్కారం అనే టైటిల్ కూడా ఖరారు చేసుకున్నారనేది ఆ ప్రచారం సారాంశం.
నాని కోసం సిద్ధం చేసుకున్న ఆ కథను అల్లు అర్జున్ కోరిక మేరకు దిల్ రాజు ఆ స్టోరీని బన్నీ వద్దకు పంపించినట్టు టాక్. మరి అంతిమంగా అల్లు అర్జున్ ఈ సినిమాకు ఓకే చెప్పాడా లేదా అనే విషయంలోనే ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఒకవేళ బన్నీ సభకు నమస్కారం చెబితే, అతడిని మొదటిసారి రాజకీయ నాయకుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కినట్టే.