'అసాధ్యుడు' చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ సినీ నట జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే.. ఈ చిత్రంలోనే సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా 'అల్లూరి సీతారామరాజు' వేషంలో నటించారు. ఆ పాత్ర కోసమే ప్రత్యేకంగా దర్శకుడు ఒక బ్యాలేని రూపకల్పన చేయడం విశేషం. 1968 జనవరి 12 తేదిన విడుదలైన 'అసాధ్యుడు' చిత్రం ద్వారానే ప్రముఖ ఛాయాగ్రహకుడు వి.ఎస్.ఆర్.స్వామి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు.
టైగర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్.హెచ్.హుస్సేన్ నిర్మించిన ఈ చిత్రం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ఈ చిత్రంలో తాను అల్లూరి సీతారామరాజు వేషం వేశాక, కృష్ణకి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అల్లూరి పాత్రలో కృష్ణ ఒదిగిపోయి నటించారు అన్న కితాబును కూడా ఆయన అందుకున్నారు.
అదే ప్రేరణతో ఆ తర్వాత స్వయంగా "అల్లూరి సీతారామరాజు" సినిమాను నిర్మించి అందులో కృష్ణ నటించడం గమనార్హం. విచిత్రమేంటంటే, 'అసాధ్యుడు' దర్శకత్వం వహించిన రామచంద్రరావే "అల్లూరి సీతారామరాజు" చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.