Honda Elevate SUV Price and Features: జపాన్‌కి చెందిన ఫేమస్ ఆటోమొబైల్ బ్రాండ్ అయిన హోండా కంపెనీ నుండి SUV సెగ్మెంట్‌లో ఇటీవలే ఓ సరికొత్త కారు లాంచ్ అయింది. ఆ కారు పేరే హోండా ఎలివేట్ SUV. రెండు వారాల క్రితమే లాంచ్ అయిన హోండా ఎలివేట్ కారుకి అప్పుడే మార్కెట్లో భారీ డిమాండ్ కనిపిస్తోంది. ముందే ప్రీ బుకింగ్ మొదలుపెట్టిన హోండా కంపెనీ తాజాగా ఒకే రోజులో 200 హోండా ఎలివేట్ కార్లను డెలివరీ చేసింది. X ప్లాట్‌ఫామ్ (గతంలో ట్విటర్) ద్వారా హోండా కంపెనీ స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది.
ఒక రోజులో 200 హోండా ఎలివేట్ కార్లు ఉత్పత్తి చేయడం జరుగుతోంది అని హోండా కంపెనీ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. చెన్నైలో కార్లు డెలివరి చేసిన నేపథ్యంలో చెన్నైకి కృతజ్ఞతలు చెప్పిన హోండా కంపెనీ .. మీ సాహసయాత్రలో భాగమయ్యేలా మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యావాదాలు అని తమ పోస్టులో పేర్కొంది.
హోండా ఎలివేట్ కారు ధర :
హోండా ఎలివేట్ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలు కాగా టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షల వరకు ఉంది. హోండా ఎలివేట్ కారు మొత్తం 4 వేరియంట్లలో లాంచ్ అయింది.
హోండా ఎలివేట్ కారులో పవర్‌ట్రెయిన్ ఇంజిన్ :
హోండా ఎలివేట్ కారు ఇంజన్ విషయానికొస్తే.., హోండా కంపెనీ హోండా ఎలివేట్ కారును 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ తో రూపొందించింది. కారును వేగంగా పరుగులు పెట్టించేందుకు 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ CVT ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ 121 PS పవర్, 145.1 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. హోండా ఎలివేట్ కారు మొత్తం 7 కలర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. కలర్ల ఎంపికలోనూ సింగిల్ టోన్, 3 డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
హోండా ఎలివేట్ కారు ఫీచర్లు :
చాలాకార్లలో డ్రైవర్ సీటుకి మాత్రమే లేదా పక్కనే ఉండే వారి సీటుకు మాత్రమే సీటు బెల్ట్ రిమైండర్స్ ఉన్నాయి. కానీ హోండా ఎలివేట్ కారులో వెనుక సీటులో కూర్చున్న వారి సేఫ్టీ కోసం వెనుక సీటుకు సైతం సీట్ బెల్ట్ రిమైండర్ ఉంది. రియర్ పార్కింగ్ సెన్సార్, ఎత్తు, ఒంపులు ఉండే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ కి ఇబ్బంది లేకుండా హిల్ హోల్డ్ అసిస్ట్‌లతో సహా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. కారులో ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, అడాస్ ఫీచర్లతో కారును డిజైన్ చేశారు. హోండా కనెక్ట్ యాప్ ద్వారా కారు సేఫ్టీ ఫీచర్స్ ఎంజాయ్ చేయవచ్చు.
హోండా ఎలివేట్ కారులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 458 లీటర్ల కార్గో స్పేస్, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్, ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్‌లు వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇంకెన్నో ఉన్నాయి. తక్కువ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ SUV కారు కావడంతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉండటంతో లాంచ్ అయిన వెంటనే హోండా ఎలివేట్ కారుకి మార్కెట్లో భారి డిమాండ్ ఏర్పడింది. మేకింగ్ కెపాసిటీ సైతం అధికంగానే ఉండటంతో కొద్ది రోజుల్లోనే అమ్మకాల పరంగానూ హోండా ఎలివేట్ కారు మంచి మైలురాయిని అందుకునే అవకాశం లేకపోలేదు అని హోండా కంపెనీ ధీమా వ్యక్తంచేసింది.
Honda Elevate Car: ఒకేరోజు 200 కార్ల డెలివరి.. హాట్ కేక్‌లా మారనున్న సరికొత్త SUV