Apple iPhone 15 Specs Leaked: యాపిల్ ఐఫోన్ 15 లాంచింగ్ కి రంగం సిద్ధం అవుతోంది. యాపిల్ ఐఫోన్స్ లాంచింగ్ లో ఒక సంస్కృతి ఉంది. ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ అవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఐఫోన్ 12 మోడల్ మాత్రమే అప్పట్లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొంత ఆలస్యంగా అక్టోబర్ లో లాంచ్ అయింది. ఐఫోన్ 15 కూడా ఆనవాయితీ ప్రకారమే 2023 సెప్టెంబర్ లో లాంచ్ కానుంది. అయితే, అంతకంటే ముందే ఐఫోన్ 15 మోడల్ కి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటకు లీక్ అయ్యాయి.
ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 15 కొంత పెద్ద స్కీన్‌తో లాంచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం ఐఫోన్ 15 మొబైల్ 6.2 అంగుళాల స్క్రీన్‌తో డిజైన్ చేశారని సమాచారం. ఐఫోన్ 15 కోసం పాత వెర్షన్ తరహాలో రెగ్యులర్ ఫ్లాగ్‌షిప్ చిప్స్ ఉపయోగిస్తున్నారు. ఐఫోన్ 15 కోసం A16 బయోనిక్ చిప్ ఉపయోగిస్తున్నారు.
ఐఫోన్ 15 బ్యాటరీ, చార్జింగ్
ఐఫోన్ 15 బ్యాటరీ, చార్జర్ విషయానికొస్తే.. ఈ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఇటీవల కాలంలో లాంచ్ అవుతున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో హై స్పీడ్ చార్జర్స్ కామన్ అవుతుండటంతో ఈ ఐ ఫోన్ 15 చార్జర్‌లో కూడా కొంత ప్లస్ పాయింట్ ఉండేలా యాపిల్ జాగ్రత్త పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి ఫోన్ ఛార్జర్ 240W సూపర్ స్పీడ్ చార్జింగ్ సౌకర్యం కలిగి ఉంది. ఇది కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే జీరో నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుంది అని రియల్‌మి కంపెనీ స్పష్టంచేసింది. యాపిల్ ఐఫోన్ యూజర్స్ కూడా ఇలాంటి హై స్పీడ్ చార్జింగ్ సౌకర్యం కోసం వేచిచూస్తున్నారు. అయినప్పటికీ.. యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఫోన్‌తో పాటు చార్జర్‌ని విక్రయించడం ఎప్పుడో మానేశాయి. యాపిల్, శాంసంగ్ ఫోన్ల కొనుగోలు విషయంలో మొబైల్‌కి సపోర్ట్ చేసే చార్జర్‌ని విడిగా కొనాల్సిందే.
ఐపోన్ 15 కెమెరా
ప్రస్తుతం ఉన్న ఐఫోన్లలో ప్రో మోడల్స్ తరహాలో ఈ ఐఫోన్ 15 కోసం 48MP వైడ్ లెన్స్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. 12MP కెమెరాలతో పోల్చితే ఐఫోన్ 15 మోడల్స్‌లో ఇదొక బిగ్గెస్ట్ అప్‌గ్రేడేషన్ అవుతుంది. అంతేకాకుండా డ్యూయల్ కెమెరా స్థానంలో త్రిపుల్ కెమెరా సిస్టం ఉండనుందని తెలుస్తోంది. ఈ వివరాలన్నీ లీక్ రాయుళ్లు చెబుతున్న వివరాలే కానీ యాపిల్ అధికారికంగా ప్రకటించినవి కావు అనే విషయం మర్చిపోకూడదు.