ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న ఈ రాజీనామాలు భావోద్వేగంతో చేశారా లేక సీరియస్‌గానే చేశారా అనే అంశంపై స్పీకర్ ఎంపీలతో చర్చించనున్నారు. కాగా ఇప్పటికే తనను వచ్చి కలవాలంటూ వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే!
తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు నేడు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘రాజీనామాలు ఆమోదించండి లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ అనేదే తమ నినాదమన్నారు. రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు.