AP Teachers Protest: సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతుండటంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో తనిఖీలు చేపట్టారు.
కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలువరించడం పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. మారువేషాల్లో వచ్చిన ఉద్యోగులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఘటనపై అప్పట్లో సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. అప్పటి డీజీపీ బదిలీ వెనుక కూడా ఇదే కారణమన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న పోలీసులు మరోసారి అలాంటి పొరపాటు జరగకూడదని భావిస్తున్నారు.
ఉపాధ్యాయుల చలో విజయవాడను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధిపై బలగాలను మోహరించారు. ఐడీ కార్డులు చూపించిన వారినే అనుమతిస్తున్నారు. దాంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల తీరుపై వాహనదారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు.
మరోవైపు విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తాడేపల్లి వైపు వాహనాలను తనిఖీలు చేయనిదే అనుమతించడంలేదు. అనుమానం వస్తే ప్రయాణికుల సెల్ ఫోన్లను తీసుకొని ఉద్యోగుల వాట్సప్ గ్రూపులతో సభ్యులుగా ఉన్నారో లేదో పరిశీలిస్తున్నారు. ఉద్యోగులని తేలిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
గతంలోలాగ ఉపాధ్యాయులు మారు వేషాల్లో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారధి నుంచి కాజా టోల్‌గేట్ మధ్య ఎక్కడా ఆపొద్దని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.రోబో పార్టీ స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read: PK KCR Meeting: సీఎం కేసీఆర్‌కు పీకే కీలక సూచన... వచ్చే ఎన్నికల్లో ఆ సిట్టింగ్‌లను మార్చాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.