తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిందని సమాచారం. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి అభ్యర్థిగా గాలి ముద్దు కృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మను ఎంపిక చేశారని తెలుస్తోంది. తొలుత ఆయన ఇద్దరు కుమారుల్లో ఎవరో ఒకరికి టికెట్టు ఇద్దామనుకున్న టీడీపీ అధిష్టానం తర్జనభర్జన అనంతరం చివరికి ముద్దుకృష్ణమ సతీమణికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సంప్రదాయం ప్రకారం ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును ఆ కుటుంబానికే ఇవ్వాలని భావించిన టీడీపీ.. ఆయన కుమారుడు భాను ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోవడానికి మంచి అభ్యర్థిని చేజార్చుకున్నట్లే అవుతుందనేది టీడీపీ అభిప్రాయమని పలువురు అంటున్నారు . మరో కుమారుడు జగదీశ్‌కి ఇద్దామనుకున్నా .. చివరికి ముద్దు కృష్ణమ సతీమణి వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.
ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 21న పోలింగ్ జరుగుతుంది. పోటీ లేకపోతే.. మే మూడో తేదీనే విజేతను ప్రకటించారు.
2015లో జరిగిన ఎన్నికలో చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముద్దుకృష్ణమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముద్దుకృష్ణమ ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఈ స్థానం స్థానిక సంస్థల కోటాకు సంబంధించినది కాబట్టి జిల్లావ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల ఓటింగు ద్వారా ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకే.
టీడీపీ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఖరారు..!