మాతృభాషలోనే విద్యాభ్యాసంపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

మాతృభాషలోనే విద్యాభ్యాసంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Last Updated : Nov 12, 2019, 08:47 AM IST
మాతృభాషలోనే విద్యాభ్యాసంపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మాతృభాషలో చదివేవిద్యార్థులకు ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని.. అప్పుడే దేశంలోని వివిధ భారతీయ భాషలకు పునర్వైభవం వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 10వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధనపై రాష్ట్రప్రభుత్వాలు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. సోమవారం ఢిల్లీలోని జేఎన్‌యూ మూడో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని కానీ పునాది మాత్రం మాతృభాషలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 10వ తరగతి తర్వాత మాధ్యమాల్లో చేరితే.. భాష, విషయం సులభంగా అలవడుతాయని... అలా కాకుండా కాన్వెంట్ స్కూళ్లలో చదివితేనే పైకి వెళ్లగలమని అనుకోవడం పొరపాటని సూచిస్తూ.. రాష్ట్రపతి, తాను, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

భారత విద్యా విధానాన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి... నైతికత, విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు కళలు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలపై మరింత దృష్టిసారించాలని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు సూచించారు. భారత అత్యుత్తమ విద్యాసంస్థల్లో జేఎన్‌యూ రెండో స్థానంలో ఉండటం గర్వించదగిన పరిణామమన్నారు. అయితే అంతర్జాతీయ ఉత్తమ విద్యాసంస్థల సూచీలో టాప్-100లో భారత్ నుంచి ఒక్క వర్సిటీ గానీ, కాలేజీగానీ లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. అలాగని దీన్ని బలహీనతగా భావించవద్దని.. మరింత కష్టపడి, చిత్తశుద్ధితో పనిచేస్తే సమీప భవిష్యత్తులో ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటామని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తంచేశారు. సానుకూల దృక్పథాన్ని అవలంబించాలని, విద్యార్థుల్లో  పోటీతత్వంతోపాటు వివిధ రంగాల్లో పరిశోధనలకోసం మరిన్ని అవకాశాలు కల్పించాలని వర్సిటీలకు సూచించారు. నాటి విశ్వగురుగా ఉన్న భారత్‌ను మళ్లీ ఆ స్థానంలో చూసేందుకు.. జ్ఞానం, సృజనాత్మకను ప్రోత్సహించే విద్యావిధానంతో ముందుకెళ్లాలని సూచించారు. 

అంతకంటే ముందుగా జేఎన్‌యూలో పలు విభాగాల్లో చేసిన పరిశోధనలకు గాను పలువురు విద్యార్థులకు ఆయన పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. ఇందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం సంతోషకరంగా ఉందని.. విద్య, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ రంగాల్లో మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ జనాభాలో 50% ఉన్నమహిళలకు రాజకీయాల్లోనూ సరిపోయేంత రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల పాత్ర లేకుండా ఏ దేశాభివృద్ధినీ ఊహించలేమని మహిళల సేవలను కొనియాడారు.
 
ప్రకృతిని, సంస్కృతిని కాపాడుకునేలా విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలని.. ఈ రెండింటినీ కలుపుకుని వెళ్తేనే భవ్యమైన భవిష్యత్తుకు బాటలు పడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్, జేఎన్‌యూ చాన్స్‌లర్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ వీకే సారస్వత్, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్‌తోపాటు వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

ఓవైపు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Trending News