సినీ ప్రపంచంలో ధ్రువతారగా వెలుగొందిన శ్రీదేవి... అందరినీ వదిలి నింగికెగశారు. ఆమె మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీతారలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
'సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, అత్యద్భుత ప్రతిభతో శ్రీదేవి చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..'
-ప్రధాని నరేంద్ర మోదీ
'శ్రీదేవి ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్షలాది మంది అభిమానులను ఆవేదనకు గురిచేసింది. మూండ్రమ్ పిరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాల్లో ఆమె నటన ఎందరో సాటి నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'
- రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
'శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు'
- ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్. నరసింహన్
'బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా నిలిచిపోయారు. అద్భుత నటన ఆమె సొంతం. శ్రీదేవి మృతి తీరని లోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
'శ్రీదేవి మృతివార్త అభిమానులను షాక్కు గురిచేసింది. అలాగే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, పలు సినిమాల్లో పోషించిన అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి'
- తెలంగాణ సీఎం కేసీఆర్
‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’
- ప్రతిపక్ష నేత వైఎస్ జగన్