ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్‌

ప్రత్యేకహోదా సాధించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.

Last Updated : Apr 16, 2018, 04:43 PM IST
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్‌

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటులో కేంద్రం వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోదా సాధన సమితి బంద్‌కు అధికార తెలుగుదేశం, బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. విజయవాడ నెహ్రూ బస్టాండులో వామపక్షాలు ఆందోళనకు దిగడంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. అలాగే కృష్ణా జిల్లావ్యాప్తంగా కూడా బస్సులు బంద్ అయ్యాయి.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోదా సాధన సమితి, వైకాపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ బస్సులను అడ్డుకుంటున్నారు.

 

 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం హోదా సాధన సమితి పిలుపు మేరకు బంద్‌లో పాల్గొనాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని..  అయితే బంద్ వల్ల సామాన్య ప్రజలకు ఆటంకం కలగకుండా ప్రశాంత వాతావారణం కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

 

 

 

 

 

ప్రత్యేకహోదా సాధించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. రాష్ట్ర బంద్ నేపథ్యంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ బంద్‌ సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ, స్వచ్ఛంద సంఘాలు సైతం ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడంతో ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలపడానికి పార్టీల కార్యకర్తలు సిద్ధమయ్యారు. 

తెల్లవారుజాము నుంచే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రోడ్లపైకి వచ్చాయి. విజయవాడ, కడప, కర్నూలు సహా అనేక ప్రాంతాల్లో విపక్ష నేతలు బస్ డిపోల వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. వ్యాపార సంస్థలు, సినిమాహాళ్లు బంద్‌కు సహకరించాలని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయాలని విన్నవించారు. ముఖ్య కూడళ్లలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం చేపట్టిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని  కాంగ్రెస్, వైకాపా, జనసేన, వామపక్షాలు, హోదా పోరాట సంఘాలు కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని తెలిపారు.

మరోవైపు రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర బంద్ పై సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనజీవనానికి ఇబ్బందులు  కలగకుండా చూడాలన్నారు. అరాచక శక్తులు బంద్‌లో చొరబడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరగరాదని, శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు. ఢిల్లీలో ఆందోళనలు చేసే ఏ పార్టీకైనా, ప్రజా సంఘాలకైనా తెదేపా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. నష్టం లేని వినూత్న నిరసనలు తెలిపి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలకు చంద్రబాబు సూచించారు.

 

Trending News