విజయవాడ: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు విజయవాడ పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయమై విజయవాడలోని పైపుల రోడ్డులో బహిరంగ మీడియా సమావేశం నిర్వహిస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సరిగ్గా వర్మ చేసిన ఈ ప్రకటనపై స్పందించిన పోలీసులు.. నగరంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనకు నోటీసులు జారీచేశారు. నగరంలో ప్రస్తుత పరిస్థితిని, ఎన్నికల నిబంధనల వివరాలను తెలియజేస్తూ విజయవాడ నార్త్ ఏసీపీ రమేశ్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్మ వ్యతిరేక వర్గం మీడియా సమావేశాన్ని అడ్డుకునే అవకాశం ఉందని.. ఈ క్రమంలో అక్కడ ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం లేకపోలేదని పోలీసులు పేర్కొన్నారు. అందుకే వర్మ తన నిర్ణయాన్ని మార్చుకుని మీడియా సమావేశాన్ని ఏదైనా ప్రెస్ క్లబ్లో కానీ లేదా మరేదైనా హాల్లో కానీ నిర్వహించుకుంటే బాగుంటుందని సూచించారు.
రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్డులో వర్మ బహిరంగ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్ల అత్యవసర సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్యాక్ట్, 144 సెక్షన్ అమలు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించినా అది నేరమే అవుతుందని పోలీసులు తేల్చిచెబుతున్నారు.