వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియో

అందరికీ అప్పులు ఎగ్గొట్టి శేషేంద్ర కుమార్ సూసైడ్ చేసుకున్నాడనే అనుకున్నారు ఆ గ్రామస్తులు.

Last Updated : Jan 24, 2018, 11:20 PM IST
వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియో

యజమాని మోసం చేశాడనే మనస్తాపంతో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసుకుంటోన్న చిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం ఈదుమూడిలో సోమవారం చోటుచేసుకుంది. అయితే, ఆ చిరుద్యోగి ఆత్మహత్యకు అతడి యజమానే కారణం అనే విషయం మాత్రం అతడి సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియో వెలుగు చూశాకే అర్థమైందంటున్నారు స్థానికులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఓ శీతల గిడ్డంగిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మన్నె శేషేంద్ర కుమార్‌ సోమవారం ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

ఎంతోమంది రైతులకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి వున్న శేషెంద్ర కుమార్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికంగా చర్చనియాంశమైంది. అందరికీ అప్పులు ఎగ్గొట్టి శేషేంద్ర కుమార్ సూసైడ్ చేసుకున్నాడనే అనుకున్నారు ఆ గ్రామస్తులు. కానీ శేషేంద్ర తాను ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో వెలుగుచూశాక అర్థమైన అసలు విషయం ఏంటంటే.. 'తాను పనిచేస్తున్న చోట కోల్డ్ స్టోరేజీ యజమాని చేసిన మోసం భరించలేకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు' అని. 

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన కోల్ట్ స్టోరేజ్ యజమాని.. వారికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చాడు. కానీ రైతులు మాత్రం తమకు అందాల్సిన ఆ డబ్బుని అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శేషేంద్ర కుమార్ నొక్కేస్తున్నాడని అనుకున్నారు. ఇదే విషయమై పలుమార్లు రైతులకు, శేషేంద్రకు మధ్య వాగ్వీవాదం కూడా జరగినట్టు తెలుస్తోంది. 

దీంతో ఇక తన యజమాని ఎలాగూ తనకు డబ్బులు ఇవ్వడు కనుక రైతుల దృష్టిలో తాను ఓ మోసగాడిగా మిగిలిపోతానని భావించిన శేషేంద్రకుమార్ అదే భయంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తన సెల్ఫీ వీడియోలో వెల్లడించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది అంటున్నారు గ్రామస్తులు. 

Trending News