అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ: నరేంద్ర మోదీ ప్రసంగంలో హైలెట్స్

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారత ప్రధాని తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేశారు

Last Updated : Jul 21, 2018, 04:57 PM IST
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ: నరేంద్ర మోదీ ప్రసంగంలో హైలెట్స్

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారత ప్రధాని తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేశారు. టీడీపీ పార్టీకి కూడా హితవు పలికారు. టీఆర్‌ఎస్ పార్టీని పొగిడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడినా ఇబ్బందులు రాలేదని.. కాంగ్రెస్ విభజించిన ఆంధ్ర రాష్ట్రం తోటే ఇబ్బందులొస్తున్నాయని తెలిపారు. అవిశ్వాసం కావాలని తెలిపే ప్రతిపక్షాలు అహంకారులని కూడా మోదీ అన్నారు. సంఖ్యాబలం లేకుండా అవిశ్వాసం ఎలా పెట్టారని ప్రశ్నించిన మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన వ్యాఖ్యలు మీకోసం..

*సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అంశాల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ తప్పులు పడితే క్షమించేది లేదు.

*చంద్రశేఖర్, దేవగౌడ, గుజ్రాల్‌ లాంటి నేతలకు మద్దతు ప్రకటించి.. వారిని ప్రధాని గద్దె నుండి పక్కకు తప్పించిన ఘనత కాంగ్రెస్‌కు ఉంది.

*మేం రిజర్వేషన్లు తొలిగిస్తామని ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేస్తున్నాయి. అందులో వాస్తవం లేదు.

*పార్లమెంటు తలుపులు మూసి ఒక రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రగల్భాలు పలుకుతుంది. తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నది వాస్తవం కాదా..

*ప్రత్యేక హోదా విషయంలో మాకు పరిమితులు ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఎవరేమి అనుకున్నా.. మేము చేసేది ఏమీ లేదు.

*2016 సెప్టెంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.

*చంద్రబాబు నాతో మాట్లాడినప్పుడు వైసీపీ పార్టీ వలలో పడుతున్నారని చెప్పాను. రాజకీయాల కోసం రాష్ట్రానికి జరిగే మేలును అడ్డుకోకూడదని అన్నాను. కానీ.. ఇప్పుడు అందరూ రాజకీయాల కోసం పార్లమెంటును కూడా వాడుకుంటున్నారు.

*ఒక రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందించినా.. దాని ప్రభావం మిగతా రాష్ట్రాలపై కూడా పడుతుంది. 

*పేద ప్రజల కోసం బ్యాంకులు గతంలో ఎప్పుడూ తెరుచుకోలేదు. మా ప్రభుత్వం వచ్చాకే వారి చేత బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి, ఆర్థిక చేయూతను కూడా ఇస్తున్నాం.

Trending News