హైదరాబాద్: కోడెల శివప్రసాద రావు ఇంట్లో తండ్రికి కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మిలతో విబేధాలు తలెత్తాయని, తండ్రీ, కొడుకుల మధ్య ఘర్షణ జరిగిందని.. ఆ ఘర్షణే ఆయన ఆత్మహత్యకు కారణమని మీడియాలో రకరకాల వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై స్పందించిన కోడెల కుమార్తె విజయలక్ష్మి.. తామంతా ఇంట్లో ఆనందంగానే ఉన్నామని.. తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో విబేధాలు ఉన్నట్టుగా వస్తోన్న వార్తలను ఓ దుష్ప్రచారంగా కొట్టిపడేశారామె. ఈ దుష్ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆమె.. తమ బతుకులు తమని బతకనివ్వమని దుష్ప్రచారం చేస్తున్న వారిపై అసహనం వెళ్లగక్కారు.
తన తండ్రి మృతి వార్త తెలుసుకున్న కోడెల శివరాం కెన్యా నుంచి భారత్కి తిరుగుప్రయాణమయ్యారు. మంగళవారం ఏ సమయంలోనైనా ఆయన ఇంటికి చేరుకుంటారని.. ఆ తర్వాతే కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు జరుగుతాయని టీడీపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాకు తెలిపారు.