తిరిగి కాంగ్రెస్ గూటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..!

మ‌రో పది నెలల్లో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను రాష్ట్రంలోని ప్రధాన పార్టీల‌న్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Last Updated : Jun 26, 2018, 05:56 PM IST
తిరిగి కాంగ్రెస్ గూటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..!

మ‌రో పది నెలల్లో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను రాష్ట్రంలోని ప్రధాన పార్టీల‌న్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలకు రెడ్ కార్పెట్ వేసేందుకు రెడీ అయింది. ఇప్పుడున్న నేత‌లు పార్టీని బ‌లోపేతం చేయ‌లేర‌ని ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. కాంగ్రెస్‌ను వీడిన నేతలను ఆహ్వానించే పనిలో పడింది. కొత్తగా నియమించబడ్డ ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఇంచార్జ్ ఉమన్ చాందీ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలు కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని కోరిన సంగతి తెలిసిందే.

2014 క్రితం టీడీపీ, వైసీపీ, బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన నేతలు ఉండేవారు. రాష్ట్ర విభజనతో వారంతా త‌మ‌కు న‌చ్చిన పార్టీలోకి జంప్ చేశారు. ఉమ్మడి ఏపీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ నుంచి బయటికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైనా సరే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రజల్లో ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిపై విశ్వసనీయత ఉందని.. దాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు పార్టీలోకి రప్పించాలని భావిస్తోంది. నల్లారి సమైక్యాంధ్ర కోరుతూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 'జై సమైక్యాంధ్ర' పార్టీని పెట్టి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా ఈయనతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు సమావేశమయ్యారు. కిరణ్‌కుమార్‌ను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆయన ఆహ్వానించారు. దీంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఇంచార్జ్ ఉమన్ చాందీతో భేటీ అవుతారని నల్లారి సన్నిహితులు తెలిపారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ కేంద్ర మంత్రులు కే.సాయిప్రతాప్, కావూరి సాంబశివరావు వంటి సీనియర్ నాయకులపై కూడా ప్రత్యేక దృష్టిసారించి ఆహ్వానిస్తే వారు కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రావచ్చని భావిస్తున్నారు. సీరియస్‌గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పార్టీని వీడిని నేతలంతా తిరిగి వస్తారని.. మళ్లీ కాంగ్రెస్‌కు ఏపీలో పూర్వవైభవం తీసుకురావచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావంతో ఉంది.

Trending News