న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఓ లేఖ రాయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసింహా రావు తెలిపారు. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం అంటే.. పార్లమెంట్‌కి ఉన్న విశేషాధికారాలను ధిక్కరించినట్టేనని జీవీఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఉండదని కేరళ సీఎం విజయన్‌కు జీవీఎల్ గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధంగా అభివర్ణిస్తూ మంగళవారం కేరళ అసెంబ్లీ ఓ తీర్మానం చేసిన నేపథ్యంలో జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also : పౌరసత్వ సవరణ చట్టం: అపోహలు- నిజాలు
కేరళ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేరళ సీఎం పినరయి విజయన్.. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం జారీచేయడంలో దేశంలో మతపరమైన అసమానతలకు దారితీస్తుందని అన్నారు. సీఎం విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సీపీఎం, కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించగా సభలో ఉన్న ఏకైక బీజేపి ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రమే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు.