ఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం దేశ రాజధాని వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు దర్మపోరాట దీక్ష చేపట్టారు. ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్రానికి ప్రశ్నించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి..కేంద్రం తీరుపై మరోమారు ధ్వజమెత్తారు. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలైమందన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని..అందుకు బీజేపీకి కూడా మద్దతు పలికిందన్నారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చాకా మోడీ సర్కార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరిపోయిందని విమర్శించారు. అలాగే జాతీయ ప్రాజెక్టు పోలవరం డీపీఆర్‌ను ఆమోదించలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదు... రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని మోడీ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి
ఇటీవలె ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపారని.. ఏపీ విషషయంలో కేంద్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు తాము తమ హక్కులు కోసం పోరాటం చేస్తున్నాం తప్పితే.. బిక్ష కోసం కాదన్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్ కు చంద్రబాబు హెచ్చరించారు. మూడు రోజుల సమయం ఇస్తున్నా.... పార్లమెంట్ వేదికగా ఏపీ ప్రజలకు మోడీ సర్కార్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు..ఇది ఏపీ ఆత్మగౌరవం సమస్య అని చంద్రబాబు వ్యాఖ్యానించారు
జాతీయ పార్టీల మద్దతు...
దేశరాజధానిలోని ఏపీ భవన్ వేదికగా జరుగుతున్న ధర్మపోరాట దీక్ష ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కాగా నల్లచొక్కా ధరించి టీడీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. మరోవైపు వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.