Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Mandous Effect In Ap: మాండూస్ తుఫాన్ దూసుకువస్తోంది. పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 08:01 AM IST
  • మహాబలిపురం సమీపంలో తీరం దాటిన మాండూస్ తుఫాన్
  • నేటి సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం
  • ఈ ఆరు జిల్లాల ప్రజలకు అలర్ట్
Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Mandous Effect In Ap: ఆంధ్రప్రదేశ్‌కు వర్షం ముప్పు ముంచుకువస్తోంది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో మాండూస్ తుఫాన్ తీరం దాటినట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. నేడు, రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సీఎం జగన మోహన్ రెడ్డి తుఫాన్ ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. తాడేపల్లిలోని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను మానిటరింగ్‌ చేస్తున్నారు అధికారులు. తుఫాను ప్రభావం చూపే  జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అలర్డ్ చేస్తున్నారు. 

సహాయక చర్యల కోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని దాదాపు కోటి మందికి సబ్‌స్రైబర్లకి హెచ్చరికలు పంపించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా 
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నెల్లూరు జిల్లాలో ప్రజలకు సాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. టోల్‌ ప్రీ నంబరు 1077 నంబరుకు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. విద్యుత్‌ స్తంభాలు, లైన్లు తెగినా టోల్‌ ఫ్రీ నంబరు 1912కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండి.. ప్రజలకు తక్షణ సాయం అందించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. 

మాండూస్ తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది. తమిళనాడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 40 మంది సభ్యుల బృందంతో పాటు, 16 వేల మంది పోలీసులు, 1,500 మంది హోంగార్డులను మోహరించారు. దీంతో పాటు డీడీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. కావేరీ డెల్టా ప్రాంతంతో పాటు తీర ప్రాంతాల్లో ఇప్పటికే 400 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించారు. 

మాండూస్ అంటే..

హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ తుఫాను పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 'సైక్లోన్ మాండస్'గా ఎంపిక చేసింది. ఇది అరబిక్ భాషా పదం. అంటే నిధి పెట్టె అని అర్థం. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. హిందూ మహాసముద్రంలోని దేశాలు తమ వంతు వచ్చినప్పుడు ఆంగ్ల వర్ణమాల ప్రకారం తుఫాను అని పిలుస్తారు. ఈసారి యూఎఈ వంతు రావడంతో మాండూస్‌గా నామకరణం చేసింది. 

Also Read: Ind Vs Ban: నేడే ఆఖరి వన్డే.. క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేందుకు టీమిండియా మాస్టర్ ప్లాన్..!  

Also Read: Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News