ఏపీకి కేంద్ర మంత్రి పదవులట.. నిన్న వరకు లైట్ గా లీకులు వినిపించాయి...ఆ లికులు కాస్త ఊహాగానాల రూపంలో బరింత బలంగా వీస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఏపీ బీజేపీకి చెందిన బడా నేతలు మంత్రి దక్కించుకునేందుకు ఎవరి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు..ఇదే క్రమంంలో హైకమాండ్ వద్ద క్యూ కడుతూ తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయంలో ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ రేసులో ఇటీవలె టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ తో పాటు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా , పలువురు సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం.
ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీలో టెన్షన్
ఎన్నికల తర్వాత ఏపీలో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీని మరింత బలహీన పర్చేందుకు అపరేషన్ టీడీపీ అంటూ ఏపీలో బీజేపీ కలకలం రేపుతోంది.. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు నేతలను లాగేసి టీడీపీ గుండెల్లో గుబులు పుట్టేలా చేసింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పక్కకు నెట్టి... ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఏపీ బీజేపీ ప్రయాళికలు రచిస్తోంది. అది సాధ్యపడాలంటే టీడీపీని మరింత బలహీనం చేయాలనే వ్యూహంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
హోదా కాదు..పదవి ఇస్తే బెటర్
ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసినంత మాత్రాన ఏపీలో బలపడలేమని గ్రహించిన బీజేపీ హైకమాండ్ ...ఏపీకి ఏదో చేయాలి.... లేకుంటే ఇక్కడ పాగా వేయడం కష్టం.. ఎలాగో ప్రత్యేక హోదా ఇవ్వలేం... కాబట్టి ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తి ..అదేనండి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎలాగుంటదని ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలాంటి ఆలోచన చేస్తున్న పార్టీ హైకమాండ్ చిన్న చిన్నగా లీకులు ఇస్తూ వస్తోంది. ఢిల్లీ హైకమాండ్ నుంచి పరోక్ష సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కాషాయ నేతలు కేంద్ర మంత్రి పదవి కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ముందు వరసలో సుజనా చౌదరీ !
ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పదవి అంశం లీకుల రూపంలో బయటికి రావడంతో ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఎవరికి వారు తమ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పరిధిలో లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్. ఆ రేసులో ముందు వరసలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ ఉన్నారట..తన దైన శైలిలో లాబీయింగ్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టీడీపీలో ఉన్నంత కాలం సుజనాకు మంచి ప్రాధాన్యత ఉంది. టీడీపీలోని అన్ని జిల్లాల నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆపరేషన్ టీడీపీ పేరిట బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేస్తూ... టీడీపీ నేతలను తమ వైపు ఆకర్షించేందుకు తాను బలమైన నేతగా ఫోకస్ అవ్వాల్సి ఉందనే వాదనతో కేంద్ర మంత్రి పదవి కోసం సుజనా లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుత పరిస్థితి బట్టి సుజనాకే కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు మొండుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఏకమౌతున్న సుజనా వ్యతిరేక శక్తులు !!
ఇదిలా ఉంటే సుజనాను అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఢిల్లీ స్థాయిలో జోరుగా సాగుతున్నట్లు టాక్. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి కేంద్ర పదవి ఇవ్వరని ..సుజనాకు అంత ప్రాధాన్యత ఉండబోదని సీనియర్ బీజేపీ నేతల వాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేంద్ర మంత్రి పదవి రేసులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీలతో పాటు పలువురు సీనియర్ నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సుజనా చౌదరీ మాత్రం మరో రకంగా వాదిస్తున్నట్లు తెలిసింది. కండవా ఎప్పుడు వేసుకున్నామనేది ముఖ్యం కాదు..హైకమాండ్ కు కనెక్ట్ అయ్యామా లేదా అనేది ముఖ్యమనే అనే వాదనను వినిపించేందుకు సుజనా రెడీ అవుతున్నారట. మరి హైకమాండ్ మదిలో ఏమంది..ఈ విషయంలో మోడీ-అమిత్ షా జోడీ ఏం ఆలోచన చేస్తోంది... అనేది తెలాల్సి ఉంది.