Sharmila Hot Comments: కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్టణం జిల్లాలో పర్యటించారు. విశాఖలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో షర్మిల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. పాలక పక్షం-ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ, బీజేపీపై షర్మిల విమర్శలు చేశారు. అధికారి వైసీపీ బీజేపీతో తెరవెనుక పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. కంటికి కనిపించని పొత్తు బీజేపీతో కొనసాగుతోందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నాడు సీఎం జగన్ దీక్షలు చేశారని, 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ అనలేదా అని గుర్తు చేశారు. ఇప్పుడు మాట మాత్రమైనా జగన్ కేంద్రాన్ని ప్రత్యేక హోదా విషయమై అడగడం లేదని విమర్శించారు. విశాఖపట్టణానికి ఏం చేశారని ప్రశ్నించారు. రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ పోరాటం లేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌లో 30 వేల మందికి భరోసా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగవరం పోర్టును అప్పనంగా అదానీ జగన్ అప్పచెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో విలువైన సంస్థలను తాకట్టు పెట్టారని షర్మిల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వలేదని చెప్పారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైసీపీ, టీడీపీ విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం లేదని తెలిపారు. మతతత్వ పార్టీ బీజేపీని తుంగలోకి తొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడడానికి నేను రెడీ, మీరు రెడీయా అని షర్మిల పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి కాంగ్రెస్ రావాలి అని నినదించారు.
ఇచ్చాపురంలో పర్యటన
ఏపీలో జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం షర్మిల ఇచ్చాపురంలో పర్యటించారు. అక్కడ తన తండ్రి వైఎస్సార్ చేసిన పాదయాత్ర అక్కడి ముగిసిందని గుర్తు చేసుకున్నారు. ఆ సభలో కూడా ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా తప్పక వస్తుందని తెలిపారు. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని రాహుల్ గాంధీ మాటిచ్చారని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా పని చేయాలని ఇచ్చాపురం సభలో షర్మిల పిలుపునిచ్చారు.
Also Read: Parliament Elections: బర్రెలక్క మరో సంచలనం.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై?
Also Read: Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook