న్యూ ఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆర్థికంగా ఏపీ సర్కార్ ఎదుర్కుంటున్న అనేక సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏపీ మంత్రి బుగ్గన.. ప్రజా సంక్షేమం, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి చేయూతను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో గత ప్రభుత్వం దాదాపు రూ. 40వేల కోట్లపైనే అప్పుచేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. పాత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా కొత్తగా అప్పు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని.. ఈ నేపథ్యంలో కేంద్రమే ఏపీకి సహాయం చేయాలని కోరామని చెప్పారు.
కేంద్రం నుంచి ఇవ్వాల్సిన దానిలో రూ. 1,850 కోట్లు విడుదల చేశారని చెప్పిన మంత్రి బుగ్గన.. మిగిలినవి కూడా ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రాల విషయంలో ఎవరి సంక్షేమ పథకాల ప్రాముఖ్యతలు వారికి ఉంటాయని.. అమ్మఒడి, రైతు భరోసా, బోధనా రుసుముల చెల్లింపు, వృద్దాప్య పెన్షన్, వాహన మిత్ర వంటి పథకాలకు ఏపీ సర్కార్ ప్రాముఖ్యతనిస్తుందని స్పష్టంచేశారు.
వాహన మిత్ర పథకం ముఖ్య ఉద్దేశ్యం గురించి చెబుతూ.. చట్టాన్ని పూర్తి స్థాయిలో అనుసరించేలా చూడటం కోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులు కట్టాల్సిన భీమాను కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. దీంతో రైతు భీమా పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న రైతుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి బుగ్గన వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు ఏవైనా.. అందులో బయటికి కనిపించే సహాయం ఒకటి ఉంటే.. వాటికి మించిన దీర్ఘకాలిక లాభాలు ఎక్కువగా ఉండేలాగే ఆ పథకాలను రూపొందించడం జరుగుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించిన మంత్రి బుగ్గన:
ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఇసుక పాలసీ అనంతరం పని కరువైన భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారని విపక్షాలు చేస్తోన్న విమర్శలను ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొట్టిపడేశారు. చంద్రబాబుకు వేరే ఏమీ దొరకక ఏదో ఓ కారణాలతో చనిపోతున్న వారిని కూడా ఇందుకే చనిపోతున్నారని చెప్పుకొస్తున్నారని విమర్శించారు. అలా మాట్లాడటం చంద్రబాబు వయసుకు, స్థాయికి తగదని మంత్రి బుగ్గన హితవు పలికారు.