కొచ్చిలో ఏపీ సీఎం చంద్రబాబు

Last Updated : Nov 12, 2017, 10:47 AM IST
కొచ్చిలో ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేరళలోని కొచ్చిన్ కు వెళ్లారు. అక్కడ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించారు. దాని కన్నా అద్భుతంగా, భారీగా ఉండాలని అన్నారు. ఆయన కొచ్చి కు ఎందుకు వెళ్లినట్టు, అంతలా అక్కడ ఏమున్నట్లు, దాని కన్నా బాగుండాలి అని ఎందుకు అన్నట్టు అనేగా మీ డౌట్? 

విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం  నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ కన్వెన్షన్ ను లులు గ్రూప్ నిర్మిస్తోంది. ఆ సంస్థే కొచ్చి లో ఆల్రెడీ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో, హంగులతో నిర్మించిన ఆ కన్వెన్షన్ వసతులను, నిర్మాణ శైలిని పరిశీలించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక బృందాన్ని వేసుకొని వెళ్లారు. 

10 వేల సీటింగ్‌ సామర్థ్యం, 250 గదులతో నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌, 2.2 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మాల్‌ను సీఎం చంద్రబాబు, ఆయన బృందం పరిశీలించారు. కొచ్చి కన్వెన్షన్‌ సెంటర్‌ ‘బ్యాక్‌ వాటర్స్‌’ తీరాన ఉండగా, విశాఖలో నిర్మించే దానికి సముద్ర తీరం అదనపు ఆకర్షణగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. 

ఇప్పటికే బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయినందున కన్వెన్షన్‌ సెంటర్‌, మాల్‌ ను ప్రభుత్వం కేటాయించిన స్థలంలో త్వరగా నిర్మించాలని ముఖ్యమంత్రి కోరగా, లులు సంస్థ అత్యాధునిక హంగులతో, భారీ స్థాయిలో నిర్మించాలంటే ఇప్పటికే ఇచ్చిన స్థలం కాకుండా మరికొంత స్థలం కావాలని కోరింది. భూసేకరణ ద్వారానైనా ఆ మిగితా స్థలాన్ని తీసుకుని, త్వరలోనే కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Trending News