ఉండవల్లి ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధికార నివాసంలో ఫిర్యాదులు స్వీకరణ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఆదివారం ఉదయం ఆ విభాగాన్ని చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. తెల్లవారుఝామునే జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రజలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే సచివాలయానికి వెళ్లి, అక్కడి ఫిర్యాదుల విభాగానికి రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాల్సి వచ్చేది.
అయితే ఇక నుండి సచివాలయంతో పాటు సీఎం నివాసం వద్ద కూడా ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వయంగా అందించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చే ప్రజలు కూర్చొనేందుకు వీలుగా, సీఎం నివాస భవనానికి పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలులో దాదాపు 500 మంది కూర్చొనే విధంగా సౌకర్యాలు కల్పించారు. సీఎం నివాసం దగ్గర ఫిర్యాదులు తీసుకొనే విభాగం, తమ వద్దకు వచ్చే ప్రతీ ఫిర్యాదును కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. సమస్య పరిష్కారం జరిగాక ఫోన్ ద్వారా సమాచారం పంపిస్తారు.
ఫిర్యాదు చేయడానికి.. సీఎం ఇంటికే పోవచ్చు