కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలూరు మండలం పెద్ద హోతూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం (లారీ) ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులందరూ కర్నూలు నగరం వన్‌టౌన్ వాసులు అని గుర్తించారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాల్సిందిగా ఆదేశించారు.