Andhra Pradesh: అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి..!

Andhra Pradesh Political News: ఏపీలో రాజకీయాలు ఎంతో వేగంగా మారుతున్నాయి. అధికార పక్షంలో కీలక పాత్ర పోషించిన నేతలు రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్నారు. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఇంతటి మార్పులు రావడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 6, 2024, 05:02 PM IST
Andhra Pradesh: అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి..!

 

Andhra Pradesh Political News In Telugu: ఏపీలో రాజకీయాలు షర వేంగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు అధికార పక్షంలో ఉండి  దర్పాన్ని ప్రదర్శించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాలంటే ససేమిరా ఇష్టపడటం లేదు. కొందరు రాత్రికి రాత్రే కండువాలు మార్చుతున్నారు. అందులో మొన్నటి వరకు జగన్ ఆహా ఓహో అంటే ఆకాశానికి ఎత్తేశారు. అధికారం పోగానే ఆయన తీరు సరికాదంటూ పార్టీకీ బై బై చెబుతున్నారు.పోనీ అధికార పార్టీలోకీ పోయినా అక్కడ  ఏదైనా సంతృప్తిగా ఉన్నారంటే అబ్బా ప్చ్ ఏంటో మా పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు. ఇంతకీ అంతలా తెగ ఫీలవుతున్న నేతలెవరు..? వాళ్ల బాధేంటి..

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయాక వైసీపీకీ పెద్ద కష్టాలే వచ్చి పడుతున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు దాదాపు పదవులన్నీ వైసీపీవే ఉండేవి. కానీ ఎన్నికలు అయ్యాక పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది. 2019లో రికార్డు స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు  అసెంబ్లీకీ వచ్చారు.అదే స్థాయిలో మిగితా పదవుల్లో కూడా  వైసీపీదే హవా కొనసాగింది. అసెంబ్లీ, మండలి,  జిల్లా పరిషత్ తో పాటు మెజార్టీ మున్సిపాలిటీలు,  గ్రామ పంచాయితీలు కూడా వైసీపీ చేజిక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీదీ ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. అలాంటి వైసీపీకీ అధికారం కోల్పోయాక అసలు తత్వం బోధపడింది. అప్పుడు జంబో ప్యాక్ లో కనపించిన వైసీపీ ఇప్పుడు రోజుకింత చతికిలపడుతుంది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి టీడీపీ వైపు జారుకుంటున్నారు. 

మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లతో మొదలైన కండువాల మార్పిడి చివరకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల వరకు చేరింది. మెల్లమెల్లగా వైసీపీ నేతలు రాత్రికి రాత్రే కండువా మార్చుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు ఆయన మీదే కామెంట్స్, సెటైర్స్ వేస్తున్నారు. జగన్ తీరు వల్లే పార్టీ ఓడిపోయిందంటూ ఒక సాకు చెప్పి పార్టీనీ మారుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే  పార్టీ నుంచి పోతున్న వారిలో మెజార్టీ నేతలు జగన్ ఏరి కోరి పదవులు ఇచ్చిన వాళ్లే. అలాంటి వాళ్లే వైసీపీనీ వీడడంపై జగన్ క్యాంప్ లో తీవ్ర చర్చ జరగుతుంది. పార్టీ కష్టకాలంలో ఉంటే నేతలు ఇలా తమ స్వార్థం కోసం పార్టీనీ వీడడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉంటే ఇటీవల పార్టీనీ వీడిన కొందరి నేతలకు వింత అనుభవం ఎదురువుతుందంట. టీడీపీలోకి రావాలంటే పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని ఆ పార్టీ అధిష్టానం కండిషన్ పెట్టిందంట.దీంతో కొందరు నేతలు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చేయే లేదో టక్కున ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు కలిసి రాజీనామా చేసిన ఎంపీలు కొందరైతే, మండలి ఛైర్మన్ కలిసి పదవులకు రిజైన్ చేయాల్సిన వాళ్లు మరి కొందరు. ఇలా వైసీపీకీ చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వెంటవెంటనే రాజీనామా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారి భవిష్యత్తు ఏంటా అనేది మాత్రం రాజీనామా చేసిన వాళ్లలో కంగారు మొదలైందంట. రాజీనామా చేశాము కానీ మనకు టీడీపీ అధిష్టానం ఎలాంటి పదవులు ఇస్తుందా అని తెగ ఆందోళన చెందుతున్నారట.

దీనిపై టీడీపీలో మాత్రం వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెగ రెచ్చిపోయారు. అలాంటి వాళ్లకు మళ్లీ పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని బల్లగుద్ది చెబుతున్నారట. ఇదే విషయం అధిష్టానానికి తెగేసి చెబుతున్నారట. రాజీనామాతో ఖాళీగా ఉన్న పదవులను పార్టీ కోసం కష్టపడ్డవారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇటీవల టీడీపీలో చేరిన వారి చెవిన పడిందంట. దీంతో ఆ నేతలు తెగ ఖంగారు పడుతున్నారట. మరి కొన్ని చోట్ల పార్టీలో నేతల చేరికను ఆయా జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఇటీవల ఆ నేతలకు చేరికను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. వారిని ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి చేర్చుకోవద్దని కాదు కూడదని పార్టీలో చేర్చుకుంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయిన ఏకంగా టీడీపీ అధిష్టానానికే సొంత పార్టీ నేతలే హెచ్చరించడం సంచలనంగా మారింది. వైసీపీ నుంచి చేరికల విషయంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుండడంతో అధిష్టానం కూడా తీవ్ర ఆలోచనలో పడిందంట. ప్రస్తుతానికి పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయ్యిందంట. అయితే పార్టీలో మరో చర్చ కూడా వినపడుతుంది. కష్టకాలంలో పార్టీకీ అండగా నిలిచి, గత జగన్ ప్రభుత్వంలో బాగా ఇబ్బందులకు గురైన వారికి ఆ పదవుల్లో అవకాశం కల్పించాలని ఆ పార్టీ అధినేత ఆలోచిస్తున్నారట. అయితే టీడీపీలో చేరిన వారిలో కొందరి విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్న మరి కొందరి విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.

ఇప్పుడు ఇదే వార్త ఇటీవల పార్టీలో చేరిన వారిని ఆలోచనలో పడేసిందంట. పార్టీ మార్పు విషంలో ఏదైనా తొందరపడ్డామా అని తమ అనచరుల వద్ద తెగ బాధపడిపోతున్నారట. ప్రతిపక్ష వైసీపీ లో ఉన్న మన పదవులు అలానే ఉండేవి. ఏదో నామ్ కే వాస్త్ ఐనా వైసీపీలో ఉంటూ పదవులనైనా ఎంజాయ్ చేసే వాళ్లం కదా అని అనుకుంటున్నారట.ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లాలని తొందరపడి పదవులకు రాజీనామా చేస్తే తమ పరిస్థితి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అని పరిస్థితి ఏర్పడింది అని తెగ బాధపడిపోతున్నారట. అయితే ఈ నేతలను చూసి ఏపీ పాలిటిక్స్ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుందంట. ఈ నేతలు ఏదో అనుకొని అధికార పార్టీలో చేరితో జరిగింది మరొకటి అని అనుకుంటున్నారట.అసలే చంద్రబాబు విజయవాడ వరదలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పట్లో తమ గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదని తెలిసి ఆ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారట.  

మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులకు లోలోన ఒకింత ఆందోళనతో ఉన్నారట. బాబు చెప్పినట్లుగా పదవులకు రాజీనామా చేశాం. ఇక తమ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో ఉందని అంటున్నారట. అయ్యిందేదో అయ్యింది . పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక ఏమీ చేయాలేం. అంతా బాబు దయ మీద ఆధారపడి ఉందని తెగ ఫీలవుతున్నారట.వైసీపీ నుంచి  టీడీపీలో చేరిన వారికి  చంద్ర బాబు అసలు పదవులు ఇస్తారా లేదా ఇస్తే ఒక వేళ ఎలాంటి పదవులు ఇస్తారో అన్నది మాత్రం మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News