ప్రధాని మోడీ ఆఫ్రిక దేశాల పర్యటనకు బయల్దేరారు.దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ల మధ్య ప్రత్యేక భేటీ జరగనుంది. ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు ఈ సందర్భంగా చర్చించనున్నారు.
ఏంటా బహుమతి ?
ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికాలను చుట్టేసి రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మొదట రువాండలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా రువాండా అధ్యక్షుడు కగామేకు మోదీ 200 ఆవులను బహుమతిగా ఇవ్వనున్నారు. వాస్తవానికి రువాండాకు పేదరిక నిర్మూలన కోసం 'గిరింకా' అనే పథకం వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు ఆ దేశ ప్రభుత్వం ఒక్కో ఆవును ఇస్తోంది. ఈ ఆవుకు ఒకటి కంటే ఎక్కువ దూడలు జన్మిస్తే... దీన్ని పక్కనున్న మరో వ్యక్తికి ఇస్తారు.
పేదరిక నిర్మూలనకు ..
తాజా పథకంతో పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాక...ఇరుగుపొరుగువారితో సఖ్యత, సోదరభావాన్ని పెంచుతుందనే భావనతో అక్కడి ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని ప్రోత్సహించే క్రమంలో మోడీ తమ వంతు సాయంగా ఇలా ఆవులను గిఫ్ట్ గా ఇవ్వాలని సంకల్పించారు.