T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..

T Congress: కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఓ షాడో లీడర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ స్నేహితుడు. ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే అంటూ కాంగ్రెస్ ప్రచారం. ఆ నేత హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే. సీఎం రేవంత్ రెడ్డి మనసు ఎరిగిన నేతగా ఉంటూ ఇటు వ్యవహారంతో పాటు రేవంత్ రెడ్డి రాజకీయాలను ఆ నేత చక్కబెడుతారట. ఒక నాడు వైఎస్ కు కేవీపీ ఎలాగో ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ నేత ఆత్మలా మారాడట. ఇంతకీ ఎవరా లీడర్..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 16, 2024, 07:51 AM IST
T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..

T Congress: రాజకీయాల్లో నీడను కూడా నమ్మవద్దు అనే ఒక సామెత ఉంది. కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. ఆలాంటి వారిలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాగా మరో నేత ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరిదీ భిన్నమైన శైలి. వీరు మిగితా నాయకులకు కాస్తా భిన్నమనే చెప్పవచ్చు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం నమ్మని ఈ రోజుల్లో ఈ ఇద్దరు నేతలు మాత్రం కుటుంబ సభ్యుల కన్నా స్నేహానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వాళ్లే. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవీపీనీ ఎలా నమ్మాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని అంతే స్థాయిలో నమ్ముతున్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వైఎస్ లాగే రేవంత్ కూడా  వేం నరేందర్ రెడ్డికి చెప్పాకే చేస్తాడని రేవంత్ సన్నిహితులు చెబుతారు.

టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగునా నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకరంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏవిధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారంలో ఉంది. రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ , రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు.ఏళ్లుగా చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న  బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారట. రేవంత్  మాటన్నా, నరేందర్ రెడ్డి మాటన్నాఒకటే నట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్లను రేవంత్ రెడ్డి  వేం నరేందర్ రెడ్డిని  కలవమని చెబుతారట. నరేందర్ రెడ్డని కలిస్తే తనను కలిసినట్టే అని రేవంత్ రెడ్డే చెబుతారట.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల స్నేహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరగుతుంది.  ఈ ఇద్దరి నేతలను చూస్తుంటే గతంలో వైఎస్, కేవీపీ జోడీ గుర్తుకు వస్తుందని కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరగుతుంది. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో తన ఆప్త మిత్రుడు కేవీపీ రాం చందర్ రావు కూడా ఇలానే వ్యవహరించే వారు. వైఎస్ ను కలువాలనుకునే వాళ్లు కేవీపీనీ మొదట కలిసే వాళ్లు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే వైఎస్ ఇచ్చినట్లే అన్నట్లుగా ఉండేది. కానీ అదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాట లేదు. తన పరిధి దాటి ప్రవర్తించిన  సందర్భాలు లేవు. తన మిత్రుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయకూడదు అనే ఆలోచనతోనే పనిచేశారు. వైఎస్ ఉన్నన్ని రోజులు కేవీపీ అతనికి ఆత్మగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ బిజీగా ఉండడంతో కొందరిని కలవడం కుదరడానికి వీలులేకుండా పోయేది. దీంతో వైఎస్ కేవీపీనీ తెర మీదకు తెచ్చి తనకు చెప్పాల్సిన వివరాలను కేవీపీ ద్వారా తెప్పించుకునేవారు.

తాజాగా వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు కేవీపీ లా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా కూడా వేం నరేందర్ రెడ్డి పాల్గొంటూ  ఎప్పటి కప్పుడు వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో కూడా వేం నరేందర్ రెడ్డి బాగా యాక్టివ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవలేని వాళ్లు అందరూ  వేం నరేందర్ రెడ్డిని కలుస్తున్నారు. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ద్వారా నేతలు రేవంత్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తమపై రేవంత్ రెడ్డికి ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా వేం నరేందర్ రెడ్డి ద్వారా తెలుసుకుంటున్నారట.

ఇక వీళ్లే కాదు కాంగ్రెస్ లో చాలా మంది నేతలు తరుచూ వేం నరేందర్ రెడ్డిని కలవడం సర్వసాధారణం అయ్యిందట. అసలే కాంగ్రెస్ లో అతి త్వరలో పదవుల జాతర కొనసాగే అవకాశం ఉన్నందున..తమ పేరు రేవంత్ రెడ్డికి సూచించాలని వేం నరేందర్ రెడ్డిని నేతలు కోరుతున్నారట. దీంతో వేం నరేందర్ రెడ్డి ఇల్లు కూడా సందడిగా మారుతుందట. ఎంత సీఎం రేవంత్ రెడ్డి ఎంత తన స్నేహితుడైనా వేం నరేందర్ రెడ్డి కూడా తన లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ కాలేదని. తన స్నేహితుడు రేవంత్ మనస్సెరిగి ప్రవర్తిస్తారనే విషయాన్ని అందరు ప్రస్తావిస్తున్నారు. వివాదాస్పద అంశాలు ఉంటే మాత్ర ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులను దరి చేయనీయరట. తన వల్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సమస్య రాకుండా చేస్తున్నారు.  రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించడమే మా విధని వేం నరేందర్ రెడ్డి అంటుంటారట. తనకు రేవంత్ ఇంత పెద్ద బాధ్యతను తన మీద పెట్టడం సంతోషంగా ఉందంటున్నారు. నా పై రేవంత్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా బాధ్యతగా ఉంటానని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకీ మరో ఆత్మ దొరకింది. నాడు కేవీపీ లాగా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటూ అధికారం ఉందనే అహంకారం లేకుండా రేవంత్ ను కలవాలనుకున్న నేతలను ఎప్పటికప్పడు కలుస్తూ వారి అభిప్రాయాలను రేవంత్ కు చేరవేస్తున్నారట. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వీరి స్నేహం ఇలాగే కొనసాగి ఇటు వారి వ్యక్తిగతంగా , అలాగే కాంగ్రెస్ పార్టీకీ కూడా మంచి పేరు వచ్చేలా కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News