సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. విమర్శలు, డిమాండ్స్

లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Last Updated : Apr 27, 2020, 07:45 PM IST
సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. విమర్శలు, డిమాండ్స్

హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా సీఎం కేసీఆర్‌కి ఓ బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి... ఆ లేఖ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించడమే కాకుండా, రైతాంగానికి ప్రభుత్వమే న్యాయం చేయాలంటూ పలు డిమాండ్స్ చిట్టాను సర్కార్ ముందుంచారు. రేవంత్ రెడ్డి లేఖలోని పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

ఏప్రిల్ 14న కురిసిన అకాల వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర పంటనష్టం వాటిల్లింది.

ఏప్రిల్ 24న ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వర్షానికి కుమురం భీం, యాదాద్రి-భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా వేల ఎకరాల వరిపంట, 613 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం జరిగింది.

మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో 1,500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మామిడి రైతులు 150 ఎకరాల పంట నష్టపోయారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులో 2 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోగా.. మరోవైపు జొన్న, ఉల్లి, తెల్ల కుసుమ పంటలు దెబ్బతిన్నాయి.

కామారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అకాల వర్షాల సమయంలో పొలం పనుల్లో ఉన్న ఐదుగురు రైతులు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులను దగా చేస్తున్న సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. 

తాలు, తేమ, తరుగు పేరుతో రైతులను వ్యాపారులు నిలువునా దోపిడీ చేస్తున్నారు. దీంతో అనేక చోట్ల రైతులు నిరసనలకు దిగుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలం లక్ష్మీపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యానికి రైతులు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. 

పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, ఎగ్లాస్‌పూర్‌లో క్వింటాల్‌కు రెండున్నర కేజీలు అధికంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టి నిరస వ్యక్తం చేశారు. 

జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, త్యాగలమర్రి కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు. 

కరీంనగర్ జిల్లా పోరండ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో తరుగు పేరుతో దోపిడీని నిరసిస్తూ రైతులు ధర్నాలు చేశారు. 

చొప్పదండిలో ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. 

నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాల్లో పసుపు పంట పండింది. అయితే, లాక్ డౌన్ కంటే ముందు క్విటాల్ పసుపు ఏడు వేలకు కొన్న వ్యాపారులు ఇప్పుడు 4,500 కు మించి కొనబోమంటున్నారు. పొరుగునే ఉన్న మహా రాష్ట్రలో క్వింటాల్ పసుపు ధర రూ.7,500 పలుకుతుండగా తెలంగాణలోనే ఈ పరిస్థితి ఏంటి ?

లాక్ డౌన్ పేరుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన జిన్నింగ్ మిల్లులను మూసి వేశారు. ఫలితంగా పత్తి కొనుగోలు నిలిచిపోయింది. పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేక, అమ్ముకునే అవకాశం లేక రైతులు సతమతం అవుతున్నారు. 

మహారాష్ట్ర, గుజరాత్‌లలో జిన్నింగ్ మిల్లులను వ్యవసాయం అనుబంధ పరిశ్రమలుగా గుర్తించి లాకౌ డౌన్‌లో కూడా నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మీరు ఆ వైపుగా కనీస శ్రద్ధ కనబరచడం లేదు.

Also read : వీడియో: రోడ్లపైకి వచ్చారో.. అంతే సంగతి

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలను ఈ బహిరంగ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి.. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ పలు డిమాండ్స్‌ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి వినిపించిన డిమాండ్స్ జాబితా ఇలా ఉంది.

అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలకు తక్షణం అధికార బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయించాలి. నష్ట పరిహారం చెల్లించాలి.

టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని తక్షణమే అమలు చేయాలి.

కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తోన్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.

పిడుగుపాటుతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి.

మిర్చీ, పత్తి, పసుపు ఇతర వాణిజ్య పంటల కొనుగోలు, మద్ధతు ధరపై తక్షణం కార్యాచరణ ప్రకటించాలి.

మామిడి, బత్తాయి, ఇతర పండ్ల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టాలి.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన రైతుల ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేయాలి.

ధాన్యంలో తేమ లేకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న నిబంధనను సడలించాలి.

తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News