అన్నపూర్ణా స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం

  

Last Updated : Nov 14, 2017, 01:12 PM IST
అన్నపూర్ణా స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం

హైదారాబాద్‌లో ప్రముఖ సినీ స్టూడియో అన్నపూర్ణా  స్టూడియోస్ లోపలి ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. "మనం" సినిమా షూటింగ్ అప్పుడు వేసిన సెట్‌కు పూర్తిగా నిప్పు అంటుకోవడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయని అంటున్నారు. అవే మంటలు ఎగసి ఎగసి పడుతూ బయటకు కూడా కనిపించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాల  నుండీ వెంట వెంటనే పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలు స్టూడియోస్ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక దళ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే స్టూడియో బయట పోలీసులను మోహరించారు. బయట వారినెవరినీ స్టూడియో దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారు. దీని వల్ల అసలు లోపల పరిస్థితి  ఏమిటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.

1975లో స్వర్గీయ అక్కినేని  నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్‌ని స్థాపించారు. తన భార్య పేరు మీద ఆయన ఆ స్టూడియోస్‌ని ప్రారంభించారు. ఇదే స్టూడియోస్‌లో అక్కినేని సొంత సినిమాలు కూడా ఎన్నోషూటింగ్ జరుపుకున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమైన సినీ స్టూడియోలలో ఇది కూడా ఒకటి. ఈ స్టూడియోస్‌కు అనుబంధంగా ఒక ఫిల్మ్ స్కూలు కూడా నడుపుతున్నారు. అక్కినేని వారసులు వెంకట్,నాగార్జున ఇద్దరూ ప్రస్తుతం ఆ స్టూడియోస్ యజమానులుగా ఉన్నారు. ఇదే స్టూడియోస్‌లో "మనం" సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఏఎన్నార్ నటించిన చివరి సన్నివేశాలను ఇదే సెట్ ప్రాంతంలో చిత్రీకరించారట.  మనం సినిమా షూటింగ్ తర్వాత ఆ సెట్‌ను ఏఎన్నార్ గుర్తుగా ఎలాంటి మార్పులు చేయకుండా యధావిధిగా ఉంచేశారు నాగార్జున. ఒక ఎగ్జిబిషన్ టైపులో దానిని  రూపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం అదే సెట్ అగ్నికి ఆహుతవ్వడం విషాదకరం. 

 

 

Trending News