‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ గ్యాంగ్ రేప్, హత్య కేసు నుంచి ఆమె తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. తల్లి రోజూ ఏడుస్తునే ఉందని దిశ తండ్రి మీడియాకు తెలిపారు.

Last Updated : Feb 7, 2020, 01:52 PM IST
‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’

దిశపై గ్యాంగ్ రేప్, సజీవ దహనం జరిగి దాదాపు రెండున్నర నెలలు కావొస్తున్నా ఆ ఘటన తమను పీడకలలలా వెంటాడుతోందని దిశ తండ్రి అన్నారు. గతేడాది నవంబర్ నెలలో తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేయడం తెలిసిందే. దిశలేని లోటును తమకు ఎవరు తీర్చలేరని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. నిర్భయ కేసు దోషులకు ఉరి వాయిదాల నేపథ్యంలో జీ హిందుస్తాన్ ప్రత్యేక ప్రతినిధి దిశ తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. తమ కూతురికి న్యాయం జరిగినా, ప్రస్తుతం కుటుంబ పరిస్థితి, ప్రభుత్వం సహకారం ఎలా ఉందన్న వివరాలను మీడియాతో దిశ తండ్రి షేర్ చేసుకున్నారు.

Also Read: నిర్భయ దోషుల ఉరి వాయిదాపై దిశ తండ్రి సంచలన వ్యాఖ్యలు

తమ కూతుర్ని ఆ నిందితులు పొట్టన పెట్టుకుని నెలలు గడుస్తున్నా.. దిశపై జరిగిన అఘాయిత్యం ఇప్పటికీతమను పీడకలలా వెంటాడుతుందని ఆమె తండ్రి అన్నారు. ప్రతిరోజూ పెద్ద కూతుర్ని తలుచుకుని దిశ తల్లి ఏడుస్తూనే ఉందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పెద్ద కూతురికి జరిగిన అన్యాయం కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉందని, చిన్న కూతుర్ని రోజూ తానే స్వయంగా తీసుకెళ్లి డ్రాప్ చేసి, మళ్లీ సాయంత్రం పిక్ అప్ చేసుకుని క్షేమంగా ఇంటికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. 

రెండో కూతురుకి ఆఫీసు క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నా.. మరోసారి అవకాశం ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నామని, అందుకే స్వయంగా తానే వెంటవెళ్తున్నట్లు బాధగా చెప్పారు. తన అక్కకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని బాధపడుతుందని, ఆ ఘటన తర్వాత నుంచి కేవలం ఆఫీసుకు తప్ప ఇతరత్రా బయట ప్రదేశాలకు వెళ్లడం మానేసిందన్నారు. తాను కూడా ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ తల్లిదండ్రుల బాధను తాము అర్థం చేసుకోగలమన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తరచుగా కాల్ చేసి మా పరిస్థితిని వాకబు చేస్తున్నారని, ఏదైనా సాయం కావాలంటే ఫోన్ చేయాలని సూచించినట్లు దిశ తండ్రి వెల్లడించారు.

Also Read: నిర్భయ దోషులకు వారం రోజుల్లోనే ఉరి..!

కాగా, గతేడాది నవంబర్ 27న తొడుంపల్లి వద్ద టోల్ గేట్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన దోషులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లు ఘటన స్థలంలో కేసు రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై దాడిచేసి పారిపోయే యత్నం చేశారు. దీంతో పోలీసులు వేరే దారిలేక నలుగురు నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసి కాల్చి చంపడం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లిదండ్రులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేయగా, ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్ చేశారని పోలీసులపై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read: దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై నిర్భయ తల్లి హర్షం 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News