హైదరాబాద్: వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. టీపీసీసీ ప్రతిపాదించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏఐసీసీ ఆమోదం లభించడంతో ఆ పార్టీ వారి పేర్లను విడుదల చేసింది. రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉదయ మోహన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇనుముల వెంకట్రామి రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.
ఇదిలావుంటే, అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం ఇదే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు.