హైదరాబాద్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన నాగరాజు అనే యువకుడి మర్డర్ మిస్టరీ వీడింది. కార్పెంటర్ నాగరాజుని అతడి భార్య జ్యోతినే హత్య చేయించినట్టు పోలీసులు నిగ్గుతేల్చారు. అయితే, ఈ కేసులో నిజానిజాలు అన్ని కేసుల మాదిరిగా పోలీసుల విచారణలో వెల్లడైనవి కాదు.. నాగరాజు హత్యలో పాల్పంచుకున్న నరేష్ అనే యువకుడు హత్యానంతరం చోటుచేసుకున్న పరిణామాలకి భయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వాటంతట అవే బయటికొచ్చాయి. లాలాగూడలో గురువారం బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరేష్ అంతకన్నా ముందుగా పోలీసులకి ఫోన్ చేసి నాగరాజు మర్డర్ వెనుకున్న వాస్తవాలు వెల్లడించాడు.
నరేష్ చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ పోలీసులు, చౌటుప్పల్ పోలీసులు పరస్పర సమన్వయంతో మరింత లోతుగా పరిశీలించగా నాగరాజు హత్య మిస్టరీ వీడింది. నాగరాజు భార్య జ్యోతి అతడి ప్రియుడు కార్తిక్ ఈ హత్యకు పథకం రచించినట్టు నరేష్ వెల్లడించాడు. నాగరాజుని హతమార్చడం కోసం కార్తిక్ తన స్నేహితుడైన దీపక్ సహాయం కోరాడు. దీంతో దీపక్ తన స్నేహితుడైన నరేష్ ని సహాయంగా వెంట తీసుకెళ్లాడు. అనంతరం నాగరాజుకి నిద్రమాత్రలు ఇచ్చి, అతడు మత్తులోకి జారుకున్న తర్వాత అతడికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశామని.. శవాన్ని కారులో తీసుకెళ్లి చౌటుప్పల్ శివార్లలోని ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేశామని నరేష్ పూసగుచ్చినట్టు చెప్పాడు. అలా ఈ హత్యలో తాను కూడా పాల్పంచుకోవాల్సి వచ్చిందని నరేష్ పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఐదేళ్ల క్రితమే నాగరాజు-జ్యోతిలకి వివాహం జరిగింది. కానీ తమ వివాహం కన్నా ముందు నుంచే తనకి కార్తిక్‌తో పరిచయం వున్నట్టు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్న జ్యోతి అంగీకరించింది. కార్తిక్ ప్రోద్బలంతోనే తాను అతడికి సహకరించినట్టు ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన జ్యోతి, కార్తిక్ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మీడియా ముందు హాజరుపరిచారు.