అనసూయ.. ఎంత పని చేశావ్! యాంకర్ అనసూయకు 'సెల్ఫీ ట్రబుల్స్'

సోషల్ మీడియాలో యాంకర్ అనసూయపై వెల్లువెత్తుతున్న విమర్శలు

Last Updated : Feb 6, 2018, 11:59 PM IST
అనసూయ.. ఎంత పని చేశావ్! యాంకర్ అనసూయకు 'సెల్ఫీ ట్రబుల్స్'

అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో యాంకర్ అనసూయ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో మహిళల్ని అగౌరపరుస్తూ వాడిన అసభ్య పదజాలంపై అనసూయ గళమెత్తిన తీరు అప్పట్లో ఆమెని వార్తల్లో నిలబెట్టింది. ఆ వివాదం ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో కొత్త వివాదంలో అనసూయ పేరు తెరపైకొచ్చింది. 

మంగళవారం తన వ్యక్తిగత పనిపై హైదరాబాద్‌లోని తార్నాకకు వెళ్లిన అనసూయను గమనించిన ఓ కుర్ర అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. తన ప్రమేయం లేకుండా ఆ కుర్రాడు తనతో సెల్ఫీ తీసుకోవడాన్ని తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా భావించిన అనసూయ  ఆ కుర్రాడిపట్ల సీరియస్‌గా స్పందించింది. అతడి ఫోన్ లాక్కోని నేలకేసి కొట్టడం, అది పగిలిపోవడం అన్నీ వెను వెంటనే జరిగిపోయాయి. అక్కడి నుంచి ఆ కుర్రాడు వెళ్లిపోయాడు.. ఆ తర్వాత అనసూయ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిది. కానీ అసలు సీన్ ఆ తర్వాతే స్టార్ట్ అయింది.

ఇక్కడ సీన్ కట్ చేస్తే, నెక్ట్స్ సీన్ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వున్న ఓయూ పోలీసు స్టేషన్‌కి షిఫ్ట్ అయింది. అనసూయ తన కొడుకు పట్ల దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటమే కాకుండా అతడి వద్ద వున్న ఫోన్ పగలగొట్టిందని పేర్కొంటూ ఆ కుర్రాడి తల్లి పోలీసులని ఆశ్రయించారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు వెంటనే యాంకర్ అనసూయపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఈ మొత్తం ఎపిసోడ్ కాస్తా మీడియాకెక్కడం, సోషల్ మీడియాలో హల్‌చల్ కావడం చకాచకా జరిగిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ ఈ వివాదంపై స్పందిస్తూ.. యాంకర్ అనసూయ మద్యం మత్తులోనే ఇదంతా చేసి వుంటుందని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె మద్యం మత్తులో వుందో లేదో చెక్ చేసి చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజెన్ హైదరాబాద్ పోలీసులని కోరారు. 

 

ట్విటర్‌లో ఆ నెటిజెన్ ఇచ్చిన ట్వీట్‌కి తక్షణమే స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. మరిన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా అతడికి రిప్లై ఇచ్చారు. ట్విటర్‌లో ఓ నెటిజెన్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన పోలీసులు అతడిని మరిన్ని వివరాలు కోరడంపై విస్తుపోయిన అనసూయ.. "త్వరితగతిన పోలీసులు స్పందించడం సంతోషకరమే అయినా.. వారు తనని ట్యాగ్ చేయడానికన్నా ముందుగా ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుంది" అని హైదరాబాద్ పోలీసులకి రిప్లై ఇచ్చింది. 

ఈ మొత్తం వివాదంలో యాంకర్ అనసూయ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆమెని ఇబ్బందుల్లో పడేసింది. ఓ బాలుడి పట్ల అనసూయ ప్రవర్తించిన తీరు సరి కాదంటూ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. 

Trending News