Aditya-L1 Mission Rehearsals And Internal Checking Done: బెంగళూరు: చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవడంతో పాటు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చంద్రుడిపై అడుగిడిన నాల్గవ దేశంగాను రికార్డు సొంతం చేసుకుంది. చంద్రయాన్ 3 విజయవంతం అవడంతో ఇక ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో సూర్యుడిపై కన్నేసింది. చంద్రయాన్ 3 తరహాలోనే ప్రతిష్టాత్మకమైన సోలార్ మిషన్- ఆదిత్య L1 ప్రయోగానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2న శుక్రవారం నాడు ఆదిత్య L1 నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోనుంది.
ఆదిత్య-ఎల్1 మిషన్‌ను సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి లాంచ్ చేయనున్నారు. ఆదిత్య-ఎల్ 1 కి తేదీ, సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ లో సాంకేతిక తనిఖీలు, రిహార్సల్ పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది.
ఆదిత్య-L1 ప్రయోగంలో భాగంగా సూర్యుడికి, భూమికి మధ్య భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 లాగ్రాంజియన్ పాయింట్ వద్ద నుండి సౌర కరోనా రిమోట్ అబ్జర్వేషన్స్ ఇస్రో అధ్యయనం చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం కోసం మన దేశం ప్రయోగిస్తున్న మొట్టమొదటి సోలార్ మిషన్ ఇదే అవుతుంది. ఆదిత్య L1 ప్రయోగం కోసం PSLV-C57 రాకెట్ ఉపయోగిస్తున్నారు.
" ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అందులో భాగంగానే నేటి బుధవారం లాంచ్ రిహార్సల్, రాకెట్‌లో అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి " అని ఇస్రో తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ఆదిత్య L1 మిషన్, సూర్యుడి చుట్టూ ఉన్న లాంగ్రెజియన్ పాయింట్ అనే L1 కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేయనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరలను వివిధ వేవ్‌బ్యాండ్‌లలో పరిశీలించడానికి వీలుగా ఏడు పేలోడ్‌లను మోసుకెళ్తోంది. ఆదిత్య-ఎల్1 ప్రయోగం కోసం జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి చేస్తున్నాం అని ఇస్రో అధికారి వెల్లడించారు.
విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పేలోడ్‌ను డెవలప్ చేయడంలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ కీలక పాత్ర పోషించింది. అలాగే పూణేలోని ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ వాళ్లు సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజర్ పేలోడ్‌ను డెవలప్ చేశారని.. వాటినే ఆదిత్య L1 ప్రయోగంలో సూర్యుడిపై అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నాం అని ఇస్రో ప్రకటించడం విశేషం.