భారతీయ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ 1500 మీటర్ల రేసులో ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇదే రేసులో 800 మీటర్ల రేసులో పసిడి పతకం గెలుచుకున్న మన్జీత్ సింగ్ నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 3:44.72 నిముషాల్లో రేసు పూర్తి చేసిన జాన్సన్ తర్వాతి స్థానాల్లో ఇరాన్‌కు చెందిన అమీర్ మోరాది నిలిచాడు. ఆయన ఇదే రేసును 3:45.62 నిముషాల్లో పూర్తి చేశాడు. ఇదే రేసులో బహ్రెయిన్‌కు చెందిన మహ్మద్ తియోలి 3:45.88 నిముషాల్లో రేసును పూర్తి చేసి మూడవ స్థానంలో నిలిచాడు.
జాన్సన్ ఆసియా క్రీడల్లో ఇటీవలే నిర్వహించిన 800 మీటర్ల రేసులో రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేరళకు చెందిన జిన్సన్ జాన్సన్ 2015లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్‌లో 800 మీటర్ల రేసులో రజత పతకాన్ని గెలుచుకున్నారు. అలాగే 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల రేసులో కాంస్య పతకం కూడా గెలుచుకున్నారు. అయితే తాజాగా జరిగిన 1500 మీటర్ల రేసులో తొలిసారిగా స్వర్ణ పతకం గెలుచుకొని సరికొత్త రికార్డు నమోదు చేశాడు జిన్సన్ జాన్సన్.
15 మార్చి 1991 తేదిన కేరళలోని చక్కిట్టపార ప్రాంతంలో జన్మించిన జాన్సన్ 2009లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంలో చేరకముందు కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ హాస్టల్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో హైదరాబాదులో జూనియర్ కమీషన్డ్ ఆఫీసరుగా నియమితులయ్యారు. అదే సంవత్సరం థాయిలాండ్‌లో జరిగిన ఆసియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఘనత కూడా పొందారు.