ఆసియా క్రీడల కబడ్డీ పోటీలో భారత జట్టుకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఎప్పుడూ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫైనల్‌లో కూడా గెలిచే భారత్‌కు ఈసారి సెమీఫైనల్‌లో ఇరాన్ షాక్ ఇచ్చింది. తద్వారా చరిత్రను తిరగరాసింది. 27-17 స్కోరుతో భారత జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ బి గేమ్‌లో కూడా భారత్ కేవలం ఒక పాయింట్ తేడాతో కొరియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో ఇరాన్ రెచ్చిపోయి ఆడడంతో భారత ఆటగాళ్లు పూర్తిగా ప్లానింగ్‌లో విఫలమయ్యారు.
తొలుత రెండు జట్లు హోరా హోరిగా పోరాడినా ఆ తర్వాత భారత్ గేమ్‌లో తడబాటు కనిపించింది. దీంతో ఇరాన్ ముందంజ వేసింది. తొలుత 5-1 పాయింట్లతో భారత్ ముందంజ వేసినా.. ఆ తర్వాత స్కోరు 8-8తో సమమైంది. తర్వాత 11-9 స్కోరుతో భారత్ రాణించింది. అయితే ఇరాన్ వరుసగా మూడు పాయింట్ల సాధించి అనూహ్యంగా ముందుకెళ్లడంతో భారత్ పట్టుకోల్పోతున్నట్లు అనిపించింది. 14-11 స్కోరుతో ఆధిక్యంలోకి వెళ్లిన ఇరాన్.. ఆ తర్వాత 27-17 స్కోరుతో పది పాయింట్లతో తేడాతో భారత్‌ను ఓడించింది.
ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో కబడ్డీలో తిరుగులేని రారాజుగా భారత్ వెలుగొందింది. 1990 నుంచి 2014 వరకు వరుసగా 7 సార్లు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈసారి మాత్రం సెమీస్‌లో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే మహిళల కబడ్డీ ఫైనల్స్‌కి భారత్ చేరడం విశేషం.