హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులను అప్రమత్తం చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పలు సూచనలు చేశారు.
నివర్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు పంటలు కోయడం, ధాన్యాన్ని మార్కెట్‌కి తీసుకురావడం లాంటి పనులు పెట్టుకోవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.
నివర్ తుఫాన్ ( Nivar cyclone ) వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
నివర్ తుఫాను తీరం దాటి తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా తెలంగాణలోని ఆంధ్రా సరిహద్దులను ఆనుకుని ఉన్న నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ( Telangana Agriculture minister Niranjan Reddy ) రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులను హెచ్చరిస్తూ ఈ సూచనలు చేశారు.
వరి కోతకు వచ్చిన రైతుల్లో ఆందోళన అధికమైంది. వరి కోయకపోతే భారీ వర్షాలకు వరి చేను వర్షానికి చెడిపోతుందనే భయం ఓవైపు... అలాగని వరి కోస్తే.. భారీ వర్షాలకు కోసిన పంట ఏమైపోతుందోననే భయం.. వెరసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతాంగం ఉంది.